చనిపోయిన వ్యక్తి.. తిరిగి బతకడం సాధ్యమేనా.. ఈ ప్రశ్న అనాదిగా మనిషిని వేధిస్తుంది.. దీని సమాధానం కోసం శాస్త్రవేత్తలు నిత్యం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎందరో తాము చనిపోయి.. తిరిగి బతికామని చెప్పుకున్నారు. దీనిపై అనేక పుస్తకాలు కూడా వెలువడ్డాయి. అయితే మరణించిన వ్యక్తి.. తిరిగి జీవించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ మాత్రం.. తాను పది రోజుల్లో చనిపోయి.. మూడు రోజుల తర్వాత సమాధి నుంచి తిరిగి బయటకు వస్తానని ప్రచారం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. ఆ వివరాలు..
గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన పాస్టర్ పులపాక నాగభూషణం తాజాగా ఈ తరహా ప్రచారానికి తెర తీశాడు. తాను చనిపోయినా తిరిగొస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నాగభూషణం.. సియోను బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ పేరిట స్థానికంగా చర్చి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు.. చనిపోయి మూడు రోజుల తర్వాత లేస్తానంటూ సంఘస్థులతో చెప్పాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాక నాగభూషణం తన సమాధికి స్థలం సెలక్ట్ చేసుకోవడమే కాక.. సమాధి తవ్వి రెడీగా పెట్టుకున్నట్లు ఓ ఫ్లెక్సీ వెలుగులోకి వచ్చింది.
దాంతో విషయం తెలుసుకున్న స్థానికులు అవాక్కయ్యారు. దీని గురించి పోలీసులుకు సమాచారం అందించారు. పాస్టర్ వింత చేష్టల గురించి తెలుసుకున్న గన్నవరం పోలీసులు.. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానికులు మాత్రం.. చనిపోయిన మనిషి తిరిగి ఎలా వస్తారంటూ చర్చించుకుంటున్నారు. పాస్టర్ నాగభూషణంకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నట్లు తెలుస్తోంది. నాగభూషణం వింత ప్రవర్తన స్థానికంగా చర్చనీయాంశమైంది.
నాగభూషణం ఏకంగా తాను చనిపోతున్నానంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాక గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని కూడా తవ్వించుకున్నాడు. పైగా పది రోజుల్లో తాను చనిపోతానని.. మృతి చెందిన తర్వాత తనను ఇదే సమాధిలో పెట్టాలని అందరికీ చెప్పాడు. పాస్టర్ వింత చేష్టలతో కుటుంబసభ్యులతో పాటూ స్థానికులు కంగారుపడ్డారు. చనిపోయిన మనిషి ఎలా తిరగొస్తాడని ప్రశ్నిస్తున్నారు.. పాస్టర్‌కు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.