అంబులెన్స్ వెళ్తుంది అంటేనే.. ఎవరో ప్రమాదంలో ఉన్నారని అర్థం. రోడ్డు మీద ఎంతటి ప్రముఖులు వెళ్తున్నా సరే.. అంబులెన్స్‌కి దారి వదలాల్సిందే. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ ఎవరికో ఏమో అయితే మాకేంటి.. మేం ముందు మా గమ్యస్థానానికి చేరామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ కొన్ని సార్లు దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని శెట్టూరు మండలం, చెర్లోపల్లికి చెందిన గణేష్, ఈరక్కకు 8 నెలల క్రితం కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పాప తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు పాపను కళ్యాణదుర్గం తీసుకొచ్చారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్.. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పట్టణానికి వస్తున్న సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.బందోబస్తులో భాగంగా పోలీసులు పట్టణ శివారులోని బ్రహ్మయ్యగుడి వద్ద చిన్నారి తల్లిదండ్రులు వచ్చిన వాహానాన్ని ఆపేశారని సమాచారం. కుమార్తె పరిస్థితి వివరించి.. తమకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినా.. పోలీసులు వినలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక చేసేదేంలేక అడ్డదారిలో తెలిసినవారి బైక్ మీద ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. పోలీసులు తమను అడ్డుకోకుండా ఉంటే.. తమ చిట్టితల్లి బతికి ఉండేదని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారి ఆవేదన చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకున్నారు.
కనీసం అంబెలెన్స్ వచ్చేందుకు కూడా దారి ఇవ్వలేదని చిన్నారి మేనమామ ఆరోపిస్తున్నాడు. పాప మృతదేహంతో రోడ్డు మీద బైఠాయించేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపై పోలీసులను ప్రశ్నించగా.. తాము ఎవరిని అడ్డుకోలేదని.. పాపకు అస్వస్థత అని తెలియగానే వారిని అక్కడ నుంచి వెంటనే పంపించామని తెలిపారు. మరి ఈ సంఘటనలో నిజానిజాలు దేవుడికే తెలియాలి. ఇప్పటికే ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా.. వైసీపీ శ్రేణులు మాత్రం ఇంకా స్పందించ లేదు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.