ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. మాములుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కేఏ పాల్ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అంతేకాక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తనదైన శైలిలో విరుచుకు పడుతుంటారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్ధంకాదు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన ప్రమాదాలపై కూడా పాల్ తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు. చంద్రబాబుకు ఉన్న పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఇంతమంది అమాయకులు మరణించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం, డీజీపీ.. ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాను హైకోర్టు వెళ్తానంటూ నిప్పులు చేరిగారు. అలాంటి కేఏ పాల్ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. “నేను ఇచ్చిన సూచనలను, సలహాలను పాటించినందుకు సీఎం జగన్ కు థ్యాంక్స్” అని కేఏ పాల్ అన్నారు.
ఇటీవల రాజకీయ పార్టీల సభల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు సభల్లో విషాదాల తర్వాత.. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై.. అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకించగా, మరికొన్ని పార్టీలు స్వాగతించాయి.
ఏపీలో రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడాన్ని కేఏ పాల్ కూడా స్వాగతించారు. తాను చంద్రబాబు సభల్లో జరిగిన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేసి.. కోర్టుకు వెళ్లడంతో జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. చంద్రబాబు కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెయ్యి రెట్లు బెటరని కేఏ పాల్ తెలిపారు. తాను చెప్పిన సలహాల్లో కొన్ని సీఎం జగన్ పాటించారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ తనను పిలిపించి మాట్లాడతారేమో అన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబుపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటూ అందర్నీ చంద్రబాబు మోసం చేశారని.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దూరంగా ఉండాలని సూచించారు. వర్ల రామయ్య మంచి వ్యక్తే కానీ.. అడుక్కు తింటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సార్.. సార్ అంటూ అడుక్కోవడం దేనికి వర్ల రామయ్య? అని ప్రశ్నించారు. కేఏ పాల్ అందరిపై చేస్తున్న వ్యాఖ్యలను అలా ఉంచితే.. సీఎం జగన్ కి థ్యాంక్స్ చెప్పడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.