పోలీసులు అంటే కఠినంగా ఉంటారని.. అందుకే కొంత మంది పోలీస్ స్టేషన్ కి వెళ్లాలన్నా భయపడేవారు ఉన్నారు. కానీ పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ వస్తున్నారు. పోలీసులు అంటే కఠినత్వమే కాదు.. మానవత్వం కూడా ఉందని నిరూపించుకున్నారు ఏపి పోలీసులు. కొడుకులున్నా పట్టించుకునే దిక్కులేక.. ఓ మాతృమూర్తి చనిపోవడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఏలూరు జిల్లా చెందిన పామర్తి వనజాక్షి భర్త పక్షపాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. తమకు ఉన్న కాస్త ఆస్తి కొడుకు, కూతురు కి పంచి ఇవ్వలేదని కోపంతో వారు తల్లిదండ్రులను విడిచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో వనజాక్షి కన్నుమూసింది. తల్లి చనిపోయిందన్న విషయం తెలిసి కూడా కొడుకు, కూతురు రాలేదు. గ్రామంలో మృతదేహాన్ని అనాథలా వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నంబూరి చంటి బాబు వెంటనే ఏ ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ను నూగొండపల్లి పంపించారు.
గ్రామానికి చేరుకున్న ఇద్దరు అనాథలా పడి ఉన్న వనజాక్షి మృతదేహం వద్దకు వెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఇందుకోసం గ్రామస్థుల సహాయ సహకారాలు తీసుకున్నారు. ఈ విధంగా ఆమె పాడె మోసి తమ మంచి తనాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు కఠినంగా ఉండటమే కాదు.. మానవత్వం చూపడంలో ముందుంటారని నిరూపించారని గ్రామ ప్రజలు ప్రశంసించారు. ఈ విషయం పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.