ఇంట్లో పూజలు, వ్రతాలు, ఇతరాత్ర ఎలాంటి శుభకార్యాలు చేసినా సరే కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. కొందరు ఎక్కడికైనా బయల్దేరేముందు.. దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం ప్రారంభిస్తారు. గుడికి వెళ్తే తప్పనిసరిగా టెంకాయ కొడతారు. అయితే కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్లితే.. చాలా మంది అశుభంగా భావిస్తారు. కీడు జరుగుతుందని భయపడతారు. అయితే కొబ్బరి కాయ కుళ్లడం అపశకునం కాదని.. దాని గురించి భయపడవద్దని అంటున్నారు పండితులు. ఆ విషయం పక్కన పెడితే.. మనం ఇళ్లల్లో కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్లినా.. లేక కొట్టిన తర్వాత.. వాడకుండా ఉండి బూజు పడితే.. వాటిని పడేస్తాం. కానీ ఈ కుళ్లిన కొబ్బరి కాయలతో కొందరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని మీకు తెలుసా.. అసలు కుళ్లిన కొబ్బరికాయలతో ఏం చేస్తారు.. ఏవైనా కల్తీకి వాడుతున్నారా ఏంటి అనే అనేమానం వస్తుందా.. అయిదే ఇది చదవండి.
మన దగ్గర ఉభయగోదావరి జిల్లాలు అంటే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. చాలా మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొబ్బరి కాయలు, నూనె, తెలగపిండి, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, పీచులోంచి వచ్చే పౌడర్, తాడు, ఆకుల నుంచి ఈనెలు, కమ్మలు.. ఇలా కొబ్బరి చెట్టులో ప్రయోజనం లేని భాగం అంటూ ఏది లేదు. ఆఖరికి కుళ్లిన కొబ్బరితో కూడా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు జిల్లా వాసులు. వ్యాపారులు నాణ్యమైన కొబ్బరి కాయాలను మాత్రమే కొంటారు. అందుకే తోటల యజమానులు.. కాయలను దించే సమయంలో, రాశుల నుంచి.. కుళ్లిన కాయలను ఏరి పక్కన పడేస్తుంటారు. నూటికి 5 కొబ్బరి కాయలు కుళ్లిపోయినవి వస్తుంటాయి.
ఇలా కుళ్లిన కాయలను కొనే వారు ప్రత్యేకంగా ఉంటారు. కాయ పరిమాణాన్ని బట్టి.. రూపాయి, రెండు రూపాయలకు కొనుగోలు చేస్తారు. వీటిని ప్రాసెసింగ్ చేసి ఉత్తరాదికి రవాణా చేస్తారు. ఒక్కో కాయను 8-10 రూపాయలకు అమ్ముతారు. మరి ఈ కుళ్లిన కొబ్బరి కాయలను ఏం చేస్తారు అంటే.. వీటి నుంచి వచ్చే గుజ్జును తీసి.. ఎండబెట్టి.. దాని నుంచి కొబ్బరి నూనె తయారు చేస్తారు. ఈ నూనెని సబ్బుల తయారీలో వినియోగిస్తుంటారు. కుళ్లిన కొబ్బరి నుంచి తీసిన ఈ నూనెను కేజీ 30-40 రూపాయలు పలుకుతుంది. అలానే ఈ చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తారు. ఈ చిప్పలు టన్ను 5 వేల వరకు పలుకుతాయి.
ఇక కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి.. ఉత్తరాదికి ఎగుమతి చేస్తారు. అక్కడ వీటిని శవాల దహనానికి వినియోగిస్తారు. కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు చేస్తే.. పుణ్యం వవస్తుందని నమ్ముతారు. దీని కోసం ఎక్కువగా కుళ్లిన కాయలనే వాడతారు. హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదిలో వదలడానికి ఉత్తరాది భక్తులు కుళ్లిన కాయలను బస్తాల కొద్ది కొనుగులు చేస్తారు. అప్పుడు ధర భారీగా ఉంటుంది. ఇలా కుళ్లిన కొబ్బరి కాయాలు, చిప్పలు, నూనే వంటి వాటి మీద ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా 100 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంది అంటున్నారు స్థానికులు. మరి ఈ కుళ్లిన కొబ్బరి కాయల బిజినెస్ ఐడియా మీకు నచ్చిందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.