ప్రస్తుతం కరెంట్ బిల్ అంటేనే సామాన్య ప్రజలు కంగారు పడిపోతున్నారు. ఈ నెల బిల్లు ఎంత వస్తుందో? అని భయపడుతూ ఉంటారు. అదే పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? పెద్ద హోటల్ నిర్వహించే వాళ్ల పరిస్థితి ఏంటి? నెలాఖరు రాగానే కరెంట్ బిల్లు తలుచుకుని మినీ హార్ట్ ఎటాక్ రావాలి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే హోటల్ యజమాని మాత్రం అలా కాదు. ఆయన ఒక్క రూపాయి కరెంట్ బిల్లు కట్టకపోగా ప్రభుత్వమే ఇతనికి నెలనెలా డబ్బు చెల్లిస్తూ ఉంటుంది. మరి.. ఆ హోటల్ స్టోరీ ఏంటో చదివేయండి.
ఇప్పుడు చెప్పుకోబోయే హోటల్ విశాఖలో ఉంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కి కిలోమీటరు దూరంలో బాగా రద్దీగా ఉండే గురుద్వారా జంక్షన్ లో ఈ హోటల్ ఉంది. చూడటానికి బిల్డింగ్ చుట్టూ నల్లటి రంగు అద్దాలతో అందంగా ఉంటుంది. దీనిలో మొత్తం 24 గదులు, ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఈ హోటల్ లో ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, గీజర్లు ఇలా విద్యుత్ మీద నడిచే ఎన్నో పరికరాలు ఉంటాయి. వీరికి రోజుకు 100 నుంచి 150 యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది. కానీ, ఒక్కరూపాయి కూడా బిల్లు రాదు.
ఎందుకంటే ఇది స్మార్ట్ హోటల్ అనమాట. అంతేకాకుండా దీనిని పర్యావరణ హితంగా డిజైన్ చేశారు. ఈ బిల్డింగ్ చుట్టూ అద్దాలకు బదులు సోలార్ ప్యానల్స్ ని బిగించారు. దీని ద్వారా ఉత్పత్తి జరిగే విద్యుత్ ని గ్రిడ్ కు విక్రయిస్తారు. వీరు తయారు చేసే విద్యుత్ మొత్తాన్ని విద్యుత్ శాఖ కొనుగోలు చేస్తుంది. వీరు వాడుకున్న విద్యుత్ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇలా హోటల్ యజమాని నారాయణరావు అలియాస్ బాబ్జీ బిల్లు కట్టకపోగా ఆదాయాన్ని మొందుతున్నారు.
ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించగా..”హోటల్ డిజైన్ ప్రకారం చుట్టూ గ్లాస్ పెట్టాలంటే నాకు రూ.25 లక్షల ఖర్చు అవుతుంది. ఆ పెట్టుబడిలో ఒక్క రూపాయి తిరిగి రాదు. అదే రూ.40 లక్షలు పెట్టి సోలార్ ప్యానల్స్ బిగించడ వల్ల విద్యుత్ బిల్లు తగ్గడమే కాకుండా.. ఆరేళ్లలో నా పెట్టుబడి తిరిగివస్తుంది. పైగా పర్యావరణానికి మంచి చేసిన వాడిని అవుతాను. నా అవసరం పోను మిగిలిన విద్యుత్ పై నాకు నెలనెలా ఆదాయం వస్తుంది. నెలకు 5 కిలోవాట్ల వరకు విద్యుత్ ని విక్రయిస్తూ ఉంటాం” అంటూ బాబ్జీ వెల్లడించారు.
ప్రస్తుతం విశాఖ నగరంలోనే ఈ స్మార్ట్ హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అద్దాల స్థానంలో సోలార్ ప్యానల్స్ బిగించాలనే ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం అంతా రూఫ్ టాప్స్ మీద మాత్రమే సోలార్ ప్యానల్స్ బిగిస్తున్నారు. అలా చేయడం వల్ల స్థలం సరిపోక చాలా తక్కువ ప్యానల్స్ ని మాత్రమే బిగించగలరు. అదే ఇలా భవనం చుట్టూ ప్యానల్స్ బిగించడం ద్వారా ఎక్కువ మొత్తంలో విద్యుత్ ఉత్పత్రి చేయగలమని చెబుతున్నారు. బాబ్జీ చేసిన ఆలోచన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా, ఆదాయ వనరుగా మారింది. ప్రధాని మోదీ పిలుపుతోనే బాబ్జీకి ఈ స్మార్ట్ హోటల్ ఆలోచన వచ్చినట్లు చెబుతున్నారు.