మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలు బుక్ చేసుకుని వెళతాం. అయితే వాటికి దూరాన్ని బట్టి మనీ పే చేస్తాం. కానీ పైసా ఖర్చు లేకుండా ఇక్కడ ఆటోలో ప్రయాణం చేయవచ్చు. అదెలా అంటే..
సాధారణంగా మనం బయటికి వెళ్ళాలంటే ఎక్కువగా ఆటోలో ప్రయాణం చేస్తాం. ఎందుకంటే మిగతా వాహనాలకంటే ఆటో చార్జీలు తక్కువగా ఉంటాయి.. చాలా తొందరగా గమ్యాన్ని చేరుకుంటాం. అయితే దగ్గరగా ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించుటకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులకు మరేదైనా ప్రాంతాలకు త్వరగా వెళ్లాలనుకుంటే ఆటో ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. సీనియర్ సిటీజన్స్, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నపుడు ఆటోలు మాట్లాడుకుని వెళ్లడమే ఉత్తమం. అయితే ఎక్కడాలేని విధంగా ఏపీ రాష్ట్రంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉచిత ఆటో ప్రయాణం ప్రవేశపెట్టింది. అది ఎక్కడ? ఎందుకు ఉచిత ఆటో ప్రయాణం ప్రవేశపెట్టారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
విశాఖలో కోస్టల్ బ్యాటరీ నుండి సాగర్ నగర్ వరకు.. కోస్టల్ బ్యాటరీ నుండి ఆర్ కే బీచ్ మీదుగా పార్క్ హోటల్ జంక్షన్, లాసన్స్ బే కాలనీ, తెన్నేటి పార్క్, జోడుగుళ్లపాలెం నుంచి సాగర్ నగర్ వరకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. బీచ్ రోడ్డు ప్రాంతంలో విహరించే వారికోసం ఈ ఉచిత ఈ-ఆటో రిక్షా సేవలను జీవీఎంసీ ప్రారంభించింది. ప్రతిరోజు ఈ-ఆటోరిక్షాలు బీచ్ రోడ్ స్ట్రెచ్‌లో తిరుగుతుంటాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులు ఉచిత ఆటో-రిక్షా సేవను పొందేందుకు ఆటో డ్రైవర్లు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. పర్యాటక ప్రదేశాలలో ఈ వాహనాలను ప్రోత్సహించడానికే ఈ ఉచిత ఆటో ప్రయాణం వెనక ఉన్న ప్రధాన అంశం.
ఈ వాహనాలు కాలుష్య నివారణకు దోహదం చేస్తాయి. పర్యాటకులకు ఆసక్తి కలిగించి, చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఆహ్లాదకరంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఈ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు ఉచిత సేవలు అందించడం కూడా మా ప్రధాన లక్ష్యం అంటున్నారు అధికారులు. సాధారణ ఆటోలు బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లో ఉంటాయి. కానీ ఈ వాహనాలు బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి వీటిని ఈజీగా గుర్తించవచ్చు. బీచ్ రోడ్‌లో వెళ్తున్నప్పుడు మీరుకూడా ఆపి ఎక్కేయొచ్చు. అలాగే వాహనాలు ఫ్రీగా నడుపుతున్న డ్రైవర్లకు జీవీఎంసీ అధికారులు ప్రతినెలా రూ.15,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ప్రత్యేకంగా సేవా భావం కలిగిన డ్రైవర్లను గుర్తించి ఎంపిక చేసుకున్నారు.
ఈ వాహనాలను కదలికలను ట్రాక్ చేయడానికి జియో-ట్యాగింగ్ చేసుకోవడం జరిగింది. ఈ వాహనాలు ప్రతిరోజు ఉదయం పూట 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. పూర్తి ట్రిఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడుపుతారు. ప్రతి ట్రిప్పులో కేవలం ముగ్గురికి మాత్రమే చాన్స్ ఉంటుంది. ఈ సేవలు పక్కదారి పట్టకుండా జీపీఎస్ ఉంది, పర్యవేక్షకులు కూడా ఉన్నారు. ఈ -ఆటోలు, ఉచిత ఆటో సర్వీస్, ఛార్జింగ్ సెంటర్లు తదితర సంబంధించిన విషయాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ ‘అర్బన్ క్లైమేట్ చేంజ్ రెసిలెన్స్ ట్రస్ట్ ఫండ్’ కింద అందిస్తుంది.