ఆ చేప దొరికితే లక్షాధికారి అయినట్లు భావిస్తారు మత్స్యకారులు. ఆ చేపను పట్టుకున్న జాలరికి కాసుల పంటే. అందుకే గంగపుత్రులు దానిని బంగారు చేప అంటారు. అది వలకు చిక్కడం చాలా అరుదు. అలాంటి చేప ఓ గంగపుత్రుడికి చిక్కింది. మార్కెట్ లో ఆ చేప లక్షల్లో ధర పలికింది. ఇంతకీ ఆ చేప ఏంటి? లక్షల్లో ధర పలకటానికి ఆ చేపకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అనే సందేహం మీకు రావచ్చు. అయితే మీరు ఆ చేప గొప్పతనం ఏమిటో తెలుసుకోవాల్సిందే.
గంగపుత్రుల పాలిట సిరులు పండించే చేప పేరు.. కచ్చిడి చేప దీనికే మరో పేరు గోల్డ్ ఫిష్. తెలుగు రాష్ట్రాల్లో కచ్చిడి చేప బాగా ఫేమస్. ఈ రకం చేప జాలర్లకు అరుదుగా చిక్కుతుంది. ధర అయితే లక్షల్లో పలుకుతుంది. మగ చేప అయితే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వీటికి ఆ రేంజ్ లో ధర ఉండటానికి కారణం.. ఈ చేపను మన ఆరోగ్యానికి సంబంధించిన మందుల్లో ఉపయోగిస్తారు. ఈ కచ్చిడి చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. సర్జరీ సమయంలో కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్ తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు ఖరీదైన మద్యం తయారీలో ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తుంటారు. దీంతో ఈ చేపకు మార్కెట్ లో డిమాండ్ రెట్టింపు అయ్యింది. అందుకే దీనిని “sea gold fish”అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే అని భావిస్తారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన జాలర్లకు 18 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దీనిని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవు వద్ద సోమవారం అమ్మకానికి పెట్టగా..దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. నరసాపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు 1.5 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆపై ఈ చేపను కోల్ కతాలోని ఫిష్ మార్కెడ్ లో రూ.2 లక్షలకు విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేపను చైనాకు ఎగుమతి చేస్తారని, అక్కడ ఇంకా ఎక్కువ ధర పలుకుతుందని వ్యాపారి తెలిపాడు. అందుకే ఇలాంటి చేప ఒక్కటి వలలో చిక్కినా తమ పంట పండినట్టే అని మత్స్యకారులు చెబుతుంటారు. కాగా ఈ కచ్చిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి నిత్యం ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే ఇది జాలర్లకు అరుదుగా చిక్కుతుంది. మరి.. మత్స్యకారులకు కాసులు పండించే ఈ ప్రత్యేక చేపపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.