ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒవర్ లోడుతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడుతున్నాయి. ఈక్రమంలో అందులోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి..ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అంతేకాక సమీపంలో ఉండే ప్రజలు అక్కడి చేరుకుని వాటిని తీసుకుని వెళ్తుంటారు. ఉల్లిగడ్డ, నూనె ప్యాకెట్ల, టమటాల.. ఇలా అనేక రకాల సరకులతో వెళ్లే వాహనాలు బోల్తాపడిన సమయంలో.. వాటి కోసం జనం ఎగపడుతుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వాహనాలు ఆపి.. ఎవరికి దొరికిన కాడి వారు తీసుకెళ్లారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణాలోని భద్రాచలం నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో చింతూరు- మారేడుమిల్లి మార్గం మధ్యలో రోడ్డు పై లారీ బోల్తా కొట్టింది. కొండ ప్రాంతం, మూల మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉన్న కారణంగా వేరే వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి చేపల లారీ బోల్తా పడింది. దారి పొడవునా చేపలు చెల్లాచేదురుగా పడిపోయాయి. ఈక్రమంలో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వెళ్తున్న కొందరు ప్రయాణికులు వాహనాలను ఆపి మరీ ఎవరికి దొరికినన్ని చేపలను వారు తీసుకెళ్లారు. కాగా రోడ్డుపై పడిన చేపలు క్యాట్ ఫిష్ రకానికి చెందినవిగా భావిస్తున్నారు. వీటిని రాష్ట్రంలో నిషేదించడంతో ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్ననట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన వెంటనే లారీ సిబ్బంది అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.