యాపిల్ ఐఫోన్ యూనిట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాపిల్ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్-ఒలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో యాపిల్ ఐఫోన్ ఛార్జర్లు, ఐఫోన్ సంబంధిత యాక్ససరీస్, ఇతర కేబుల్స్ తయారుచేసే ఫాక్స్ లింక్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా రెండు ఫ్యాక్టరీలు ఉండగా.. పాత ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు యూనిట్లలో 4500 మంది ఉద్యోగులు షిఫ్టుల వారీగా పని చేస్తుండగా పాత ఫ్యాక్టరీలో 2000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో 50 శాతం వరకూ ఫ్యాక్టరీలో ఉన్న మెషీన్లు కాళీ బూడిదయ్యాయి.
రా మెటీరియల్, ప్రొడక్షన్ మెటీరియల్, మిషనరీ అగ్నికి ఆహుతయ్యాయి. ఫ్యాక్టరీ భవనం కూడా ప్రమాదంలో దెబ్బతింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు విపరీతంగా చెలరేగడంతో పొగ దట్టంగా వ్యాపించింది. 5 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని రేణిగుంట అమర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో 5 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
అయితే వంద కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఐఫోన్ మార్కెట్ ను ఇండియాలో విస్తరించేందుకు యాపిల్ పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తోంది. 2017లో విస్ట్రాన్ తో కలిసి ఐఫోన్ అసెంబ్లింగ్ భారత్ లో ప్రారంభించిన యాపిల్.. ఆ తర్వాత ఫాక్స్ కాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో యాపిల్ ఉత్పతులను అసెంబ్లింగ్ చేయిస్తోంది. అందులో తిరుపతిలో ఉన్న ఫ్యాక్టరీ ఒకటి. అగ్నిప్రమాదం జరగడంతో ఆ కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది.