ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. అంతే కాదు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది.
ఇది చదవండి: SP సర్ నాకు న్యాయం చేయరా? ఫోన్ లోనే ఏడ్చేసిన మహిళ!
ఏపిలో మూడు రాజధానులు అన్న ప్రతిపాదన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అమరావతి రాజధాని అయితే అభివృద్ది జరుగుతుందని.. అనూహ్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో తాము ఎంతో నష్టపోతున్నామని అమరావతి రైతులు పాదయాత్రలు, ర్యాలీలు ఎన్నో రకాలుగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో అమరావతి రాజధాని కోసం పోరాడుతోన్న రైతులు హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద వారు టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. అంతేకాదు హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. కోర్టు తీర్పు ద్వారా ఇంకా న్యాయం బతికే ఉందని నిరూపితమైందని చెప్పారు.