రైతుకు భూమిని నమ్ముకునే జీవిస్తుంటాడు. పంట వేయడం, సాగు చేయడం, పంట వస్తే అమ్ముకోవడం, నష్టం వస్తే బాధపడడం ఇవే ఇంతకు మించి ఏదీ ఉండదు. కానీ అప్పుడప్పుడూ రైతులకు కూడా అదృష్టం వరిస్తుంది. ఓ రైతుకు తన వ్యవసాయ భూమిలో వజ్రం దొరికింది. రైతు పంట పండింది.
రాజుల కాలంలో అంగడిలో వజ్రాలు, రత్నాలు రాసులు పోసి అమ్మేవారని చరిత్రలో చదువుకున్నాం. అంటే అంత విరివిగా రత్నాలు, వజ్రాలు దొరికేవి అన్నమాట. కానీ ప్రస్తుత కాలంలో వజ్రాలు దొరకడం అంత సులభమైన విషయం కాదు. అయితే వజ్రాలతో కూడిన ప్రాంతాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాలు ఉన్నాయని, వర్షం పడితే అవి భూమినుండి బయటికి తేలుతాయని వాటిని సేకరించుటకు జనం పంటపొలాల వైపు పరుగెడతారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. వేసవికాలం తర్వాత తొలకరి మొదలవగానే అన్నదాతలు దుక్కి దున్ని సాగుకోసం తయారవుతారు. పంటను పండిస్తారు. అదే విధంగా తొలకరి వానలకు ఇక్కడి పొలాల్లో వజ్రాలు కూడా పండుతాయి.
వాన పడగానే వజ్రాల వేట కొనసాగిస్తారు. పిల్లల దగ్గరి నుండి పెద్దల దాకా సీమ నేలలో వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. జీవితంలో ఒక వజ్రం దొరికినా కూడా శ్రీమంతులవుతామని వారి ఆశ. రాయలసీమ ప్రాంతంలో వజ్రాలున్నయన్నది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న మాట. మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ జరుగుతుంది. ఇక్కడికి వేరే జిల్లాల నుండి సైతం ప్రజలు వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తారు. అక్కడ వ్యాపారులకు కూడా పోటీ ఉంటుంది. అయితే మద్దికెర మండలంలోని బసినేపల్లిలో ఒక రైతుకు వజ్రం కంటబడింది. వెంటనే అక్కడే వేచి ఉన్న వ్యాపారికి అమ్మకానికి పెట్టాడు. దాని విలువ రూ.2 కోట్లు ఉన్నట్లు ప్రచారం సాగింది. దీంతో జనమంతా పొలాల వెంట వెతకడం ప్రారంభించారు. వారికి కూడా ఏదో ఓ రోజు వజ్రం దొరుకుతుందని, కోటీశ్వరులవుతామని ఆశపడుతున్నారు.