తెలుగునాట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ కన్నుమూశారు. ఈయన వయసు 88 సంవత్సరాలు. శ్రీమన్నారాయణ తాజాగా గుండెపోటుకి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే.., వయసు ఎక్కువ కావడంతో ఆయన శరీరం వైద్యానికి స్పందించలేదు.
కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. ఆయనకు మొత్తం నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీమన్నారాయణ మొదటి నుండి రాజకీయాల్లో లేకపోయినా, కొడుకు ఉమా కోసం బాగానే కష్టపడుతూ వచ్చారు. చాలాసార్లు ఉమా ఎన్నికల్లో ఈయనే ప్రచారం చేశారు. ఇక శ్రీమన్నారాయణ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీమన్నారాయణ మృతి పట్ల పార్టీలకి అతీతంగా అంతా తమ సానుభూతుని తెలియజేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. మరి.. దేవినేని శ్రీమన్నారాయణ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం