సంక్షేమ పథకాల అమలులో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైనప్పటికీ.. ఏ కారణం చేతనైనా.. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు పిలిచి మరీ ప్రయోజనాలు అందచేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు అర్హులై.. లబ్ధి పొందని.. సుమారు 2,79,065 మంది ఖాతాలో రూ.590.91 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్.. తన క్యాంపు కార్యాలయం నుంచి.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. అనంతరం ప్రసంగించిన సీఎం జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం, అవ్వాతాతలు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఆదుకోవడం ఇస్తున్న పెన్షన్లపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లంచాలు లేకుండా.. అర్హులందరికి పథకాలు అందిస్తున్నాం. టీడీపీ హయాంలో.. సంక్షేమ పథకాలు పొందాలంటే.. జన్మభూమీ కమిటీలు వసూళ్లకు పాల్పడేవి. లంచం ఇవ్వాల్సి వచ్చేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మధ్యవర్తులు లేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం’’ అని తెలిపారు
‘‘అనర్హులకు పథకాలు రాకూడదరు.. ఇవ్వకూడదు. అలా జరిగితే నోటీసులు ఇస్తారు.. రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. దానికే ఫించన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ రీవెరిఫికేషన్ లేకుండా చర్యలు తీసుకోరు’’ అని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేవారు.