ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ సీఎం జగన్ మరోసారి రుజువు చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో మాండూస్ తుపాను, భారీ వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, కలెక్టర్లు నష్టం అంచనా విషయం ఎంతో ఉదారంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదంటూ సూచించారు. ఏ ఒక్క రైతు కూడా అధికారుల నష్టం అంచనాతో నిరాశ చెందకూడదు అంటూ ఆదేశించారు. అంతేకాకుండా బాధితులు, రైతులు అందరికీ మంచి జరిగేలా చూసుకోవాలన్నారు.
ఈ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నరంటే.. “కలెక్టర్లు, అధికారులు పంటనష్టం విషయంలో అత్యంత ఉదారంగా వ్యవహరించాలి. ఎక్కడా రైతులు నిరాశ చెందకూడదు. రంగు మారిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అనే మాట వినిపించకూడదు. ఒకవేల ధాన్యం వారు బయట అమ్ముకుంటాం అని చెబితే.. తగిన రేటు వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మర్చిపోవద్దు. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల మీదే ఉంటుంది” అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
“తుపాను వల్ల ఎక్కడ ఎలాంటి నష్టం జరిగినా కూడా అధికారులు సాయం చేయాలి. వారం రోజుల్లోగా ఈ సహాయచర్యలు జరిగిపోవాలి. తుపాను ప్రభావంతో పంటనష్టం వాటిల్లిన చోట 80 శాతం రాయితోతో విత్తనాలు ఇవ్వాలి. మళ్లీ పంటలు వేసుకునేందుకు సహకరించాలి. గోడకూలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. వారికి పరిహారం అందాలి. ఇళ్లు ముంపునకు గురైతే ఆ కుటుంబాలకు రూ.2 వేలు ఆర్థికసాయం, రేషన్ ఇవ్వాలి. ఇంట్లోకి నీళ్లు చేరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అనే మాట రాకూడదు. ఇళ్లలోకి నీరు చేరిన వారికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి. ఈ సహాయ చర్యలు, పంటనష్టం అంచనాలు, రైతులకు సహాయం అన్నీ వారం రోజుల్లోగా పూర్తి కావాలి” అంటూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.