ప్రజల సంక్షేమమే ప్రధాన ఎంజెడాగా ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వినూత్న సంక్షేమ పథకాలతో.. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తోన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకురావడమే కాక.. సాయం కోరి వచ్చిన వారిని ఆదుకుంటున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరు చేసి.. ఆ తల్లిదండ్రుల ఇంటి దీపాన్ని కాపాడారు సీఎం జగన్. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లంక ప్రాంతాలన్నీ తీవ్ర ఇబ్బందులకు గురై అయ్యాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఓ నిరుపేద దంపతులు తమ పాప దీనస్థితిని తెలియజేస్తూ.. ఆదుకోవాలని కోరుతూ.. ప్లకార్డు పట్టుకుని నిల్చున్నారు. వారిని గమనించిన సీఎం జగన్.. దగ్గరకు పిలిపించుకుని ఆరా తీశారు. వారికి కావాల్సిన సాయం అందచేయాల్సిందిగా కలెక్టర్‌ని ఆదేశించారు. కట్ చేస్తే నేడు ఆ పాప వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరు అయ్యాయి. ఆ వివరాలు..
డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన దంపతులు కొప్పాడి రాంబాబు నాగలక్ష్మిలకు రెండున్నర సంవత్సరాల చిన్నారి హనీ ఉంది. ఈ పాప గాకర్స్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చికిత్స చేయించేందుకు వారి ఆర్థిక పరిస్థితి అనుకూలించలేదు. దాంతో పాప అనారోగ్య విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి.. సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్.. హనీ వైద్యం కోసం రూ. కోటి బడ్జెట్ కేటాయించారు. ఈ విషయాన్ని స్వయంగా కలెక్టర్ హనీ తల్లిదండ్రులకు తెలిపాడు. చిన్నారికి పుట్టుకతోనే గాకర్స్ వ్యాధి వచ్చిందని.. ఫలితంగా హనీ లివర్ పనిచేయదని జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా తెలిపారు.
ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో చిన్నారి హనీకి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున ఉచితంగా 13 ఇంజెక్షన్లను పాప తల్లిదండ్రులకు అందజేశారు. అంతేకాక ఈ గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం 13 ఇంజెక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపింది. గాకర్స్ చికిత్సలో వాడే ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా.. రాయితీతో రూ.74,000 లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా బాధితులకు అందిస్తుంది. ఈ ఇంజెక్షన్ అమెరికాలో తయారవుతుందని ఇప్పటివరకు రూ 10,08,000 విలువచేసే ఇంజెక్షన్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ ఇంజక్షన్‌ని 15 రోజులకు ఒకసారి రెగ్యులర్‌గా పాపకి ఇవ్వాలని సూచించారు. హనీకి వైద్యంతో పాటు.. పింఛన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
సీఎం జగన్ తమ కుమార్తెకి వచ్చిన కష్టం తెలుసుకుని.. వెంటనే స్పందించి ఆదుకున్నారని.. ఆయన చేసిన సాయం తాము జీవితాంతం మర్చిపోమని తెలిపారు. తమ ఇంటి దీపాన్ని కాపాడారని సంతోషం వెలిబుచ్చారు. ఇక సీఎం జగన్ తమకు భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభంకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అండగా నిలవడంతో తమ బిడ్డ భవిష్యత్తుపై ఆశలు చిగురించాయని తెలిపారు.