ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో పదోన్నతులు పొందిన వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే..!
ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్‌కు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లోకి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైన విషయం విదితమే. అనంతరం పదోన్నతి పొందిన 2,096 మందికి పీఆర్సీని అమలు చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. 51,488 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ 2020, జనవరి 1వ తేదీ నుంచి పీటీడీలోకి విలీనం అయ్యారు. ఆ తర్వాత వీరిలో 2,096 మందికి ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు ఇచ్చింది. సవరించిన కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి 1 నుంచి వీళ్లంతా వేతనాలు అందుకోనున్నారు. దీనికితోడు పదోన్నతి పొందినప్పటి నుంచి రావాల్సిన వేతన బకాయిలూ నూతన పీఆర్సీ ప్రకారం చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇకపోతే, డీపీసీ రూల్స్‌కు విరుద్ధంగా.. సర్కారు అనుమతి లేకుండా వీరికి ప్రమోషన్ ఇచ్చారని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. వీళ్లకు మినహా, మిగిలిన ఎంప్లాయీస్‌కు గతేడాది సెప్టెంబర్ నుంచి పీఆర్సీని అమలు చేశారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. దీంతో 2,096 మంది ఉద్యోగులకూ ఒక్కసారిగా పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎట్టకేలకు 2,096 మందికి కూడా పీఆర్సీ అమలు కానుంది. పదోన్నతి పొందిన వారికీ కొత్త పీఆర్సీని అమలయ్యేలా చేసినందుకు సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది జీవితాంతం వరకు రుణపడి ఉంటామన్నారు. మరి.. జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.