రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణానికి ఏర్పాట్లు సిద్దం అయ్యాయి. రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తితిదే తెలిపింది. స్వామి వారి కల్యాణం కొరకు వంద కిలోల ముత్యాల తలంబ్రాలు దాదాపు రెండు లక్షల ప్యాకెట్లలో ఏర్పాటు చేసి.. కళ్యాణ మహోత్సవం తర్వాత భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో పలు ప్రదేశాల నుంచి గోటితో ఒలిచి తెచ్చిన తలంబ్రాలను స్వామికి వారికి సమర్పించేందుకు సిద్దం చేసినట్లు తితిదే వారు తెలిపారు.
వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిధిలుగా ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు కానున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.. తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు. ఇక ముఖ్యమంత్రి వస్తున్నందున ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి వారికి హనుమత్సేవ నిర్వహించారు. ఈ రోజు స్వామి వారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.. ఒంటిమిట్ట వీధుల్లో గ్రామోత్సవం ఎంతో వైభవంగ నిర్వహించారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.