గ్రామాల్లో పంచాయితీలు, వివాదాలు, గొడవలు, కొట్లాటల గురించి అందరికీ తెలుసు. అయితే చాలా వరకు కుటుంబాలు గానీ, గ్రామాలు గానీ చెరువులు, ఆస్తులు పొలాల కోసం గొడవలు పడతారు. ఆ గొడవలు ముదిరితే గ్రామ పెద్దలు, పోలీసుల వరకు వెళ్తుంది. అయితే ఇప్పుడు ఓ పంచాయితీ చాలా గ్రామాలను అవాక్కయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఓ రెండు గ్రామాలు దున్నపోతు కోసం గొడవకు దిగాయి. ఆ దున్నపోతు తమకే కావాలంటూ పట్టుబట్టాయి. ఊరి పెద్దలు, పోలీసులు కూడా వారికి నచ్చజెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. మరి.. దున్నపోతు పంచాయితీ ఎంటో చూద్దాం..
ఈ దున్నపోతు పంచాయితీ మరెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతోంది. అనంతపురం జిల్లాలోని కణేకల్ మండలంలోని అంబాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య నడుస్తోంది. ఈ గ్రామాల్లో పదేళ్లకోసారి అమ్మవారి దేవర జరుపుతుంటారు. ఆ దేవర పూర్తైన నెల రోజుల తర్వాత 3 నెలల వయసున్న దున్నపోతును కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన దున్నపోతును అమ్మవారి పేరుమీద వదిలేస్తారు. ఇప్పుడు ఈ గ్రామాలు అమ్మవారి దేవర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
జనవరి 17న అంబాపురం గ్రామవాసులు అమ్మవారి దేవర చేసేందుకు సిద్ధమయ్యారు. తర్వాత రచ్చుమర్రి గ్రామవాసులు కూడా దేవర జరపాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో దేవర సమయంలో వదిలిన దున్నపోతు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంబాపురంలో నెల రోజులు వెతికిినా వారికి దున్నపోతు దొరకలేదు. తర్వాత బొమ్మనహళ్ మండలంలో వారికి ఓ దున్నపోతు కనిపించడంతో దానిని బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఉద్దేహాళ్ కు చెందిన వారు ఆ దున్నపోత తమదేనంటూ వెళ్లారు. వారికి అంబాపురం వారు నచ్చజెప్పారు.
అయితే దేవరకు సిద్ధమవుతున్న రచ్చుమర్రి గ్రామవాసులు ఇప్పుడు ఆ దున్నపోతు తమదేనంటూ వాదనకు దిగారు. దేవర సమీపిస్తున్న సమయంలో ఇలా గొడవకు దిగడం కరెక్ట్ కాదంటూ అంబాపురం వాసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, రచ్చుమర్రి వాసులు మాత్రం వినేందుకు సిద్ధంగా లేరు. వారం రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. అంబాపురం గ్రామ పెద్దల మాటను కూడా గ్రామవాసులు వినేందుకు సిద్ధంగా లేరు. చివరికి వివాదం కణేకల్లు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.
ఇరు గ్రామాల వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు కూడా చాలా ప్రయత్నించారు. కానీ, వారు వినకపోవడంతో పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. ఈ దున్నపోతు పంచాయితీ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వీళ్ల పంచాయితీ ఎలా తేలుతుందో అని అక్కడి వాళ్లకు కూడా ఒకరకమైన ఆసక్తి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత జరగనున్న అమ్మవారి దేవర గురించి కన్నా ఈ దున్నపోతు పంచాయితీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.