ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు ఎమోషన్ కి గురి కావడం.. ఆ సమయంలో ఎదుటి వారిపై విచక్షణారహితంగా దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మద్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఒక విద్యార్థి తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే ఆ విద్యార్థిని భీమవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళితే..
భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో రెండు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థుల మద్య ఘర్షణ చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ లో ఓ విద్యార్థిపై కొంతమంది విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. దాడి జరుతున్న సమయంలో బాధిత విద్యార్థి సహ విద్యార్థులను ఎంతగానో వేడుకున్నాడు.. కానీ వారు మాత్రం కనికరం లేకుండా కర్రలతో కొట్టారు. ఐరన్ బాక్స్ తో ఛాతిపై వాతలు పెట్టారు. ఇటీవల ఓ విషయంపై ఇద్దరు విద్యార్థులకు మరస్ఫర్ధలు వచ్చాయి.. ఇది మనసులో పెట్టుకొని బాధిత విద్యార్థిపై కొంత మంది దాడి చేశారు.
హాస్టల్ లో విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన దృశ్యాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దాడిలో నలుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇంత జరిగినా కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుందని బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు పరారీలో ఉన్నట్లు సమాచారం.. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.