సంక్రాంతి పండుగ సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. దీంతో బస్టాండ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగ జరుగుపుకోవాలని వెళ్లిన వారు కొందరైతే.. జూదం, కోడి పందాలు, క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఉంటదని వెళ్ళినవారు మరొకొందరు. ఏదైతేనేం.. సంక్రాంతి పండుగ ఏపీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ రూ. 141 కోట్ల ఆదాయం గడించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు.
సాధారణంగా సంక్రాంతి అంటే ప్రైవేట్ ట్రావెల్స్‌కు పండగ. అలాంటిది ఈసారి ఎపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించిపెట్టింది. అందుకు ముఖ్య కారణం.. వారు తీసుకొచ్చిన ఆఫర్లు, ప్రకటనలే. ‘సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడుపుతాం.. కానీ ఒక్క రూపాయి కూడా అదనపు చార్జీ వసూలు చేయబోం. కుటుంబం మొత్తం ప్రయాణిస్తే 5శాతం, రాను, పోను ఒకేసారి టికెట్ కొనుగోలు చేస్తే 10శాతం రాయితీ ఇస్తాం..’ అంటూ ఏపీఎస్ ఆర్టీసీ చేసిన ప్రకటనలు ఆ సంస్థకు కాసుల వర్షం కురిపించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అంచనాకు మించి 1,483 ప్రత్యేక సర్వీసులు నడిపి రూ.141కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఎండీ తెలిపారు. గతేడాది సంక్రాంతి ముందు 2,400 బస్సులు నడిపామని, ఈసారి జనవరి 6వ తేదీ నుండి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపినట్లు ఆయన వెల్లడించారు. రోజుకు సరాసరి 15.66 కోట్లు చొప్పున రాబడి ఆర్జించినట్లు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య బస్సులను తిప్పినట్లు పేర్కొన్నారు. కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే 7.90 కోట్ల రాబడి వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.
అదనపు చార్జీలు రద్దు చేయడం, ప్రైవేటు బస్సుల్లో భారీగా టికెట్ల ధరలు పెంచడం తమకు కలిసొచ్చిందని ఆయన వెల్లడించారు. అదనపు రాయితీ ప్రయోజనాలు ప్రయాణికులను ఆకర్షించాయని ఆయన పేర్కొన్నారు. గతేడాది 50 అదనపు చార్జీతో ఆర్జించిన ఆదాయం రూ.107కోట్లు కాగా, ఈ ఏడాది రాయితీ ఇచ్చినా రూ.141కోట్లు రాబట్టామని చెప్పారు. తిరుగు ప్రయాణానికి కూడా తగినన్ని బస్సులు వేయడంతో విశేష ఆదరణ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండాప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినందుకు సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే, ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ఎపిఎస్‌ఆర్‌టిసి సంక్రాంతి పండుగకు రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. తిరుగు ప్రయాణంతో సంబంధం లేకుండా కేవలం ఈ నెల 6 నుండి 14 వరకు ఆర్‌టిసి రూ.141 కోట్ల ఆదాయాన్ని పొందింది.#APSRTC pic.twitter.com/UOHKCIwK1E
— Udayam News Telugu (@udayam_official) January 18, 2023