గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు క్వశ్చన్ పేపర్లను కూడా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. అలానే ప్రైమరీ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా తెలిపే అవకాశం కూడా ఏపీపీఎస్సీ కల్పించింది. దీనిపై అభ్యంతరాలను జనవరి 11 నుంచి 13 వరకూ స్వీకరించనుంది. అయితే ఆన్ లైన్ లో మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది. వ్యక్తిగతంగా, వాట్సాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా అభ్యంతరాలు స్వీకరించబడవని తెలిపింది.
ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రత్యేక లింక్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదు చేయవలసి ఉంటుందని వెల్లడించింది. అభ్యంతరాలకు సంబంధించిన సమాచారం, ఆధారాలను పీడీఎఫ్ ఫార్మాట్ లో జత చేయాలని.. అభ్యంతరం తెలిపే ఒక్కో ప్రశ్నకు అభ్యర్థులు రూ. 100 రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రైమరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను 3 వారాల్లో విడుదల చేస్తారు. ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి.. ఇంటర్వ్యూ పూర్తి చేస్తారు. ఆగస్టు నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ఇప్పటికే ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.