CMIE: భారత దేశంలోని సగటు నిరుద్యోగ రేటు కంటే ఏపీలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్నట్లు తేలింది. దేశంలోని సగటు నిరుద్యోగ రేటు 8 శాతం ఉండగా.. ఏపీలో నిరుద్యోగ రేటు 6 శాతం ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) తెలిపింది. ఈ మేరకు 2022కు సంబంధించిన నివేదకను తాజాగా వెల్లడించింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కలిగిన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణల కంటే ఏపీలోనే తక్కువ నిరుద్యోగ రేటు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. తెలంగాణలో నిరుద్యోగ రేటు 6.9 శాతం ఉన్నట్లు సీఎమ్‌ఐఈ వెల్లడించింది. అంతేకాదు పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్‌ల లాంటి పెద్ద రాష్ట్రాల కంటే తక్కువ నిరుద్యోగ రేటు కలిగి ఉన్నట్లు ప్రకటించింది.
ఇక, తక్కువ నిరుద్యోగ రేటు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర, అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిన రాష్ట్రంగా హరియాణా నిలిచాయి. మహారాష్ట్రలో నిరుద్యోగ రేటు 2.2 శాతం ఉండగా.. హరియాణాలో నిరుద్యోగ రేటు 37.3 శాతం ఉంది. కాగా, 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనుంచి ఏపీలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6,16,323 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. వీటిలో పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆరు లక్షల్లో 2,06,638 పర్మినెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.