మందుబాబులకు అలెర్ట్..! మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అప్రమత్తమవ్వాలి. అంటే.. ముందు స్టాక్ పెట్టుకొని తాగమని కాదు.. షాప్ ఓపెన్ ఉంటదని వెళ్లి ఎక్కడ ఇబ్బంది పడతారో అని తెలియజేస్తున్నాం..
పండగలు వచ్చినా, పబ్బాలొచ్చినా, వినాయక చవితోచ్చినా… ఆఖరికి గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం వచ్చినా మందుబాలకు చేదువార్తే. ఎందుకంటే.. ఆయా రోజుల్లో వైన్ షాపులు బంద్. ఇప్పుడు అలాంటి అకేషన్ కాకపోయినా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13న సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, టూరిజం బార్‌లు, నావల్ క్యాంటీన్లు, మద్యం డిపోలు మూతపడనున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటన చేశారు. ఎందుకు..? ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మద్యం దుకాణాలు మూతపడటానికి ముఖ్య కారణం.. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటమే. ఈ నెల 13న ఉత్తర కోస్తా ఆంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13న సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, టూరిజం బార్‌లు, నేవల్ క్యాంటీన్లు, మద్యం డిపోలను బంద్ చేస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. ఆ మూడు రోజులు మద్యం షాపులు మూసివేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.