ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ‘కోనసీమ’ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘కోనసీమ’జిల్లా పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో వందల మంది యువకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు.
‘కోనసీమ’ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కోనసీమ రణరంగంగా మారింది. ఆందోళనకారులు ఎక్కడపడితే అక్కడ.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆందోళనకారుల నిరసన సెగ మంత్రి విశ్వరూప్ కు తగిలింది. అమలాపురంలోని బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. ఈదాడిలో మంత్రి ఇంటి ఆవరణలోని మూడు కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. అయితే దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు. అక్కడనుంచి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అటు.. కోనసీమ జిల్లా పేరు మార్పుపై పునరాలోచన ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పేరు మార్పుపై అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారాయన. కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదు అన్నారు హోంమంత్రి. తన ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ అన్నారు. జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలు చెబితే పరిశీలిస్తామని చెప్పారు.