పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన.. తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగానే ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మంత్రి అబంటి రాంబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్ లో పోలవరానికి సంబంధించిన పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నాలుగు నెలలు ప్రాజెక్టుకు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తొందరపాటు వల్లనే ఇప్పుడు ఇంతా కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని విమర్శించారు. పోలవరంపై తాము ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యంతో చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు చేశారు.
“పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి మానవతప్పిదమే కారణం. ఈ మాట నేను చెప్పడం మాత్రమే కాదు.. నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట రిపేరు చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలి. అయితే ఆ మరమ్మతులు ఎలా చేయాలి అనే దానిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సీజన్లో కచ్చితంగా ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గతంలో వచ్చిన వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కి భారీగా నష్టం జరిగింది” అని తెలిపారు.
ప్రాజెక్టు ప్రారంభోత్సవం మీద కూడా అంబటి క్లారిటీ ఇచ్చారు. “డయాఫ్రమ్ వాల్ లో చంద్రబాబు తప్పిదమే కనిపిస్తోంది. ఆ గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుంది. డయాఫ్రమ్ వాల్ ని రిపేరు చేసేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పనులు కాస్త ఆలస్యం అయినా కూడా నాణ్యంగా ఉండాలి అనేది మా ప్రభుత్వం అభిమతం. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ డెడ్ లైన్లు ఎందుకు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న ప్రాజెక్టు ఇది. కచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు జగన్ చేతుల మీదుగానే ప్రారంభం అవుతుంది” అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.