ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టేసింది. టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల టీటీడీ పాలకవర్గ సభ్యులు 31 మందితో పాటు, 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని… తద్వారా సామాన్య భక్తులపై భారం పడుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. టీటీడీ స్వత్రంతను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. ఈ మేరకు ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇక వాదనలు విన్న హైకోర్టు.. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అలాగే దీనిపై టీటీడీ, వైసీపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీచేసిన జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హై కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తితిదే బోర్డులో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇక దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.