విశాఖ సాగర నగరం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్ కు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు సహా 45కు పైగా దేశాల నుంచి దౌత్యవేత్తలు, 14 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉన్న ప్రాంతం కావడంతో దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు ఎక్కువ ఆసక్తి కనపరిచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్నీ ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం కల్పిస్తోన్న వసతులు, రాయితీలపై ప్రశంసలు కురిపించారు. ఈ సమ్మిట్‌కు రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్, ఒబెరాయ్ హోటల్స్, రెన్యూ పవర్ తదితర సంస్థల నుంచి పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారు. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ జరగడం చాలా గర్వంగా ఉంది.. రాష్ట్రానికి సుమారు రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో 6లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు 340 కంపెనీలు పెట్టుబడి ప్రతిపాదనలు తెచ్చాయి. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. మొదటి రోజు 92 ఎంవోయూలు రాగా.. ఇప్పటి వరకు సుమారు 340 ఎంవోయూలు వచ్చాయి. ఇక నేడు ఒక్క రోజే రూ.8.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు జరుగుతాయి మిగిలిన కొన్ని ఎంవోయులు శనివారం జరుగుతాయని’’ తెలిపారు..
విశాఖపట్నం మినీ ఎకనిమిక్ హబ్‌గా మారుతుందన్నారు సీఎం జగన్. ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని.. గత కొన్నాళ్లుగా రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ సదుపాయాలకు అనుకూలంగా రాష్ట్రం ఉందని.. ముఖ్యమైన జీ 20 సదస్సుకు కూడా విశాఖ నగరం వేదికగా నిలిచిందని ఈ సదర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. విశాఖ పరిపాలన రాజధాని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్.. త్వరలోనే ఇక్కడ నుండే పాలన జరగబోతోందని ప్రకటించారు. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్‌గా ఉందన్నారు సీఎం జగన్.