గురువారం అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. అలానే రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక రూ.16 కోట్లతో నర్సీపట్నంలోని రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగునాథుని పాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభలో సీఎం జగన్ ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, గత పాలకుల వల్ల ఈ నర్సీపట్నంలో ఎలాంటి ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. మన ప్రభుత్వ హాయంలో నర్సీపట్నం రూపు రేఖలు మార్చబోతున్నామని, వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన అన్నారు. నర్సీపట్నంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లువస్తాయని. మెడికల్ కాలేజికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా వస్తుందని జగన్ తెలిపారు. అంతేకాక చేసేదే తాము చెపుతామని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని సీఎం అన్నారు. మా నాయకుడు జగన్ అని ప్రతి ఒక్కరు చెప్పుకునేలా పాలిస్తానని చెప్పారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపై కూడా సీఎం విరుచక పడ్డారు. రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థ తయారయిందని, చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి నిర్మాత, దర్శకుడు చంద్రబాబేనని, చంద్రబాబు డైలాగులకు పవన్ యాక్టింగ్ చేస్తారంటూ జగన్ విమర్శలు గుప్పించారు. ఒకరిది వెన్నుపోటైతే… మరొకరిది మోసమని అన్నారు. వీరిద్దరినీ చూస్తే ఇందేం ఖర్మ మన రాష్ట్రానికి అనిపిస్తుందని విమర్శించారు. వచ్చే జనవరి నుంచి పెన్షన్లను రూ.2,750కి పెంచుతామని జగన్ తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పలు విషయాలపై జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరి.. నర్సీపట్నంలో మెడికల్ కాలేజి శంకుస్థాపన చేస్తూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.