సాధారణంగా కొన్ని పనులు చేయాలంటే.. మగవారే భయపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి జంగం దేవర వృత్తి. అంటే శవాన్ని.. శ్మశానానికి తీసుకెళ్లే వరకు గంట మోగిస్తూ ఉండటం. శవాలు అంటేనే చాలా మంది భయపడతారు. ఇక ఆడవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఓ మహిళ జంగం దేవర వృత్తిని చేపట్టి.. ఏళ్లుగా దానిలో కొనసాగడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని చేసి చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్, చిల్లూరు జిల్లాకు చెందిన కాటమ్మ. పూర్వీకుల నంచి వచ్చిన జంగం దేవర వృత్తిని కాటమ్మ వారసత్వంగా స్వీకరించింది. ఇక ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిని చేపట్టాల్సి వచ్చిందో ఆమె మాటల్లోనే..
‘‘పదో తరగతి చదుతుండగానే 16వ ఏటనే నాకు పెళ్లి చేశారు. కానీ నా వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు. నా భర్త తాగుడుకి బానిస అయ్యాడు. ఇద్దరు పిల్లలు పుట్టినా ఆయన తీరు మారలేదు. తాగుడు కోసం బంగారం, ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసేవాడు. బిడ్డల కోసం కష్టపడదామనే ఆలోచనే ఆయనకు ఉండేది కాదు. దాంతో విడిపోదామని నిర్ణయించుకున్నా. రెండు కుటుంబాలవారు, ఇంకా చాలా మంది మాకు మధ్యవర్తిత్వం చేశారు. కానీ నేను చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు.. పుట్టింటికి వచ్చేశా’’ అని తెలిపింది.
ఇది కూడా చదవండి : రూపాన్ని చూసి వెలివేశారు.. ఇప్పుడు అతను ఎంతో మందికి ఆదర్శం..
‘‘పుట్టింటివారి అండతో ముగ్గురు పిల్లలను పోషించగలనని అనుకున్నాను. కానీ దురదృష్టం వెంటాడింది. మూడేళ్ల వ్యవధిలో అమ్మనాన్నలను ఇద్దరినీ కోల్పోయాను. రెండు వైపులా బంధువులెవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. దాంతో, పిల్లల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కాలేదు. మొదట పొలాల్లో కూలి పనులకు వెళ్లాను. తర్వాత కాళహస్తిలో కలంకారీ పనులకు వెళ్లేదాన్ని, తర్వాత అది కూడా మానేసి ఒక స్కూల్లో టీచరుగా పనిచేశాను. కానీ, వచ్చేది సరిపోయేది కాదు. దాంతో కుల వృత్తినే చేయాలని నిర్ణయించుకున్నా” అని కాటమ్మ గుర్తుచేసుకున్నారు.
“నాకు మొదట్లో శవం అంటేనే భయంగా ఉండేది. ఎక్కడైనా ఎవరైనా చనిపోయినట్లు తెలిసినా, ఆ ఇంటి వైపు వెళ్లేదాన్ని కాదు. కానీ, చివరకు ఈ వృత్తిలోకి వచ్చాక కాష్టం పక్కనే కూర్చుని పూజలు కూడా చేయించగలుగుతున్నా. నా చుట్టూ ఎంతమంది మగవాళ్లున్నా, అందరి ముందు ధైర్యంగా ఈ ఆచారాలన్నీ చేయగలుగుతున్నా” అంటారు కాటమ్మ. గత పదకొండేళ్లుగా ఆమె రెండు వేలకు పైగా అంత్యక్రియలు నిర్వహించానని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుకు నాలుగు, ఐదు అంత్యక్రియలు కూడా చేశానని ఆమె చెప్పారు. వారసత్వంగా వచ్చిన రెండు కిలోల బరువున్న ఇత్తడి గంటను.. ఊరికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న శ్మశానం వరకూ ఆపకుండా వాయించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ, కాటమ్మ గత 11 ఏళ్లుగా అదే పని చేస్తున్నారు.
కాటమ్మకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు హరిప్రియ పిచ్చాటూరు గ్రామ సచివాలయంలో మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొడుకు గణేష్ డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కూతురు మంజుల డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నారు.