ఏపీలో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. మరో వందే భారత్ రైలు అడుగుపెట్టనుంది. ఈ నెలలోనే వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఎక్కడ నుంచి ఎక్కడ వరకూ ఈ రైలు నడుస్తుంది. ఎప్పుడు ఈ రైలు ప్రారంభమవుతుంది? అనే వివరాలు మీ కోసం.
ఇప్పటికే ఆంధ్రాలో రెండు వందే భారత్ రైళ్లు రన్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మార్గంలో ఒక రైలు నడుస్తుండగా.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో మరో రైలు ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఏపీలో మరో వందే భారత్ రైలు అడుగులు పెట్టనుంది. విజయవాడ-చెన్నై మార్గంలో ఈ మూడవ రైలుని నడపాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మరో ఐదు వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ రైళ్లలో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఒకటి. ఈ రైలుని ప్రారంభించడానికి సంబంధిత అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి ఈ రైలు ప్రారంభమవుతుందని.. 8 నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ నుంచి చెన్నై మధ్య ఈ కొత్త వందే భారత్ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, రాకపోకలకు సంబంధించిన షెడ్యూల్, టికెట్ ధరలు వంటి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ వందే భారత్ రైలుని రేణిగుంట మీదుగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు కోరడంతో.. విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నై వెళ్లి.. మళ్ళీ అదే మార్గంలో తిరిగి వచ్చేలా నిర్ణయించారు. విజయవాడ, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఈ రైలుని రేణిగుంట మీదుగా నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. అయితే ఏయే స్టేషన్లలో ఆగుతుందో అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
సికింద్రాబాద్-తిరుపతి రైలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి.. తిరుపతికి మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంటుంది. మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రాత్రి 11:45 గంటలకు చేరుకుంటుంది. ఈ మార్గంలో నడిచే ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే రైలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి.. రాత్రి 11:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మళ్ళీ వైజాగ్ స్టేషన్ లో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ కి మధ్యాహ్నం 2:15 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు ఈ మార్గం మధ్యలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. మరి కొత్తగా ప్రారంభించనున్న విజయవాడ-చెన్నై వందే భారత్ రైలు ఏయే స్టేషన్స్ లో ఆగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.