చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు అందరిలోనూ గుబులు పుడుతుంది. నిక్కర్లు వేసుకుని నిలువుదోపిడీలకు పాల్పడే ఈ ముఠా పేరు చెబితే జనాల్లో వణుకు పుడుతుంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిందీ గ్యాంగ్. నలుగురు లేదా ఐదుగురితో ఉండే ఈ ముఠా.. చేతిలో చిన్న చిన్న మారణాయుధాలు తీసుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. ఒంటిపై కేవలం చెడ్డీ మాత్రమే ధరించడం వీరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాంటి చెడ్డీ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్‍లో మళ్లీ హల్‌చల్ చేసింది. గుంటూరు జిల్లా, మాచర్లలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. కొద్దిరోజులుగా నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందీ గ్యాంగ్.
తాజాగా మాచర్లలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మొహాలకు మంకీ క్యాప్‌లు, చేతిలో ఇనుప రాడ్లు పట్టుకుని చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. నలుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసింది. ఆ ఇళ్ల తాలాలు పగులగొట్టేందుకు ప్రయత్నించింది. ఇక వారం కింద సొసైటీ కాలనీలోని హేమశ్రీ ప్రైడ్ అనే అపార్ట్ మెంట్ లో 107వ బ్లాక్‌లో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ప్రయత్నించింది. కానీ కుదరకపోవడంతో వెళ్లిపోయారు.
పైఘటనల్లో దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియోలతో అపార్ట్‌మెంట్ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలాఉండగా.. మాచర్ల ఓల్డ్ టౌన్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో రూ. 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ లేడీ కానిస్టేబుల్ ఫ్యామిలీతో కలసి తిరుపతికి వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలపై పోలీసులు స్పందించారు. రాత్రి పూట గస్తీని మరింత ముమ్మరం చేశామని మాచర్ల టౌన్ సీఐ తెలిపారు.