పట్నం వాసుల సంగతి తెలియదు కానీ.. చిన్నప్పటి నుంచి పల్లెల్లో పెరిగిన వారు ఎవరైనా సరే.. పచ్చని పైర గాలిని, కాలుష్యం లేని పరిసరాలను, మట్టి వాసనను మర్చి పోలేరు. నేలతల్లితో ఉండే అనుబంధం వారిని అంత త్వరగా మరువనివ్వదు. జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా.. ఎన్ని ఆస్తులు సంపాదించిన పచ్చని పంట పొలాలు చూడగానే.. మనసు అటు పరుగుతీస్తుంది. మనకు తెలీకుండా మన కాళ్లు పొలాల వెంట నడుస్తాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. పొలంలో కబుర్లు చెబుతూ.. నాట్లు వేస్తున్న రైతులు తమ దగ్గరకు వచ్చిన విశిష్ట అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అతిథి కూడా రైతులతో కలిసి నాట్లు వేయడంతో వారు సంతోషించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన అనకాపల్లి జిల్లా, మునగపాక మంగళవరపు పేటలో చోటు చేసుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి మంగళవరపు పేటలో పర్చటించారు. ఈ క్రమంలో ఆమెకు పొలంలో నాట్లు వేస్తున్న రైతులు కనిపించారు. వారిని చూడగానే ఆమెకు ఒక్కసారిగా మట్టి వాసన గుర్తుకు వచ్చింది. అంతే.. ప్రభుత్వ వాహానాన్ని పక్కకు ఆపి.. పొలంలోకి వెళ్లింది. రైతులతో కలిసి వరి నాట్లు వేసింది. కలెక్టర్ చేస్తున్న పని చూసి అక్కడ పని చేసేవారు ఆశ్చర్యపోయారు. కానీ అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికి.. ఏమాత్రం భేషజం లేకుండా పొలంలో దిగి.. తమతో నాట్లు వేయడంతో రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.