ఏపిలో ఎంటర్ టైన్ మెంట్ రంగంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్న ఆందోళన నెలకొంది. ముఖ్యంగా టికెట్ రేట్ల తగ్గింపుతో పాటు.. ఏపీలో థియేటర్లలో సాగుతున్న సోదాలు ఇందుకు నిదర్శనంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్ లకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపడుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలో సినిమా థియేటర్లలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మదనపల్లిలో ఏడు సినిమా థియేటర్లు, కుప్పంలో నాలుగు సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. క్రిష్ణా జిల్లాలో ఏకంగా 12 సినిమా హాళ్లను సీజ్ చేసారు. మరికొన్ని థియేటర్లకు భారీ జరిమానాలు విధించారు. ఇదంతా ప్రభుత్వ ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో టికెట్ ధరలపై పలు సూచనలు చేసి టికెట్ ధరలు పెంచి అమ్మకూడదని తెలిపారు.
ఇదీ చదవండి : మహేష్ అరుదైన రికార్డ్.. ఆ జాబితాలో చేరిన తొలి సౌత్ యాక్టర్
ఇక గవర్నమెంట్‌కు ఎదురెళ్లలేరు.. అలాగని ఉన్న టికెట్ రేట్లతో థియేటర్స్ నడపలేరు. దీంతో అధికారులు చెప్పిన ధరలకు సినిమా టికెట్లు అమ్మితే తమకు పైనుండి ఖర్చులు అధికమవుతాయని, తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 50 సినిమా థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేశారు. కరోనా తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినా ధరలు తగ్గించడంతో తమకు నష్టాలు.. కష్టాలు తప్పవని థియేటర్ల యాజమాన్యాలు పేర్కొంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.