కిడ్నీలో ఒకటో, రెండో రాళ్లు దాచుకునేవారు ఉంటారు గానీ మరీ 3 వేలు, 4 వేలు రాళ్లు దాచుకోవడం ఏంటండీ? అన్ని రాళ్లు ఉంటే ఆ మనిషి బతుకుతాడా? అని మీకు అనిపించవచ్చు. కానీ అతను సురక్షితంగా ఉన్నాడు. డాక్టర్లు ఉన్నదే ప్రాణాలు కాపాడడానికి. ఒక వ్యక్తి కిడ్నీలో 3 వేల రాళ్లను తొలగించి అతని ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఈరోజు కిడ్నీ డే. మనుషులకు ఒక రోజు ఉన్నప్పుడు కిడ్నీలకి, గుండెకి, మైండ్ కి కూడా ఒక రోజు ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఒక రోజు ఉన్నట్టే ప్రతీ దానికీ ఒకరోజు ఉంటుంది. మామూలు రోజుల్లోనే కిడ్నీలు రాళ్లు వెనకేసుకుంటాయి. అలాంటిది దానికంటూ ఒకరోజు ఇస్తే ఊరుకుంటుందా? రికార్డు తిరగరాయదా? ఒక వ్యక్తి కిడ్నీ ఈరోజు కిడ్నీ డే అని చెప్పి ఏకంగా 3 వేల రాళ్లు దాచుకుని చరిత్ర సృష్టించింది. మరీ ఎంత కిడ్నీ రోజైతే మాత్రం ఇన్ని రాళ్లు దాచుకోవాలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకే అన్ని రాళ్లు దాచుకున్న ఆ కిడ్నీ ఎవరిదో తెలుసా? అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలానికి చెందిన ఒక వృద్ధుడిది.
మదనపల్లెలోని ఆద్య హాస్పిటల్ లో వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి 3 వేల రాళ్లను బయటకు తీశారు వైద్యులు. మూత్రపిండంలో 3 వేల రాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగించినట్టు యూరాలజీ నిపుణుడు డాక్టర్ టి. సనత్ రెడ్డి వెల్లడించారు. కుట్లు అవసరం లేకుండా కీ హోల్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని అన్నారు. ఇంతపెద్ద మొత్తంలో రాళ్లను తొలగించడం ఇదే తొలిసారి అని, చాలా అరుదైన ఘటన అని అన్నారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నారని అన్నారు. మనిషి జీవన విధానంలో మార్పులు వచ్చాయని, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయామం చేయకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, నిరంతర ఒత్తిడి కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కలుషిత ఆహారం, కలుషిత నీరు కారణంగా మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని అంటున్నారు. అధిక రక్తపోటు, డయాబెటిస్, నొప్పులకు అధిక మోతాదులో తరచూ మందులు వాడటం వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా కిడ్నీ డే నాడు ఒక వ్యక్తి కిడ్నీ లోంచి 3 వేల రాళ్లు తీసి వైద్యులు చరిత్ర సృష్టించారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.