దసరా అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం. ఇక ఎంటర్ టైన్ మెంట్ విషయానికొస్తే.. కొత్త సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తుంటాయి. ఈసారి కూడా ఏకంగా మూడు చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. అందులో చిరు ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’ లాంటి పెద్ద హీరోల సినిమాలున్నాయి. వీటితో పాటే ఓ స్మాల్ బడ్జెట్ మూవీ కూడా రిలీజైంది. అదే ‘స్వాతిముత్యం’. మరి బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన ఈ మూవీ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయాల్సిందే.
బాలకృష్ణ మురళి(బెల్లంకొండ గణేశ్) జూనియర్ ఇంజినీర్ గా చేస్తుంటాడు. పెళ్లీడుకొచ్చిన అతడికి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వదు. అలాంటి సమయంలో భాగ్యలక్ష్మిని(వర్ష బొల్లమ్మ) పెళ్లి చూపుల్లో చూస్తాడు బాల. ఆమెని చూడగానే ఇష్టపడతాడు. అదే విషయాన్ని భాగ్యలక్ష్మికి చెప్పడంతో ఆమె కాస్త సమయం అడుగుతుంది. బాలపై ఇష్టం పెరిగి పెళ్లికి కూడా రెడీ అవుతుంది. సరిగ్గా పెళ్లి జరుగుతున్న టైంలో ఓ అమ్మాయి, చంటి బిడ్డని పట్టుకొచ్చి… ఈ చిన్నారి తండ్రి బాలానే అని బాంబు పేల్చుతుంది. దీంతో పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ బాలా ఏం చేశాడు? పిల్లాడిని తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఎవరు? చివరకు ఈ సమస్య సాల్వ్ అయిందా లేదా అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి.
హీరోగా పరిచయం అవుతున్నాం అనగానే టాలీవుడ్ లో మాస్, లవ్ స్టోరీలనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ బెల్లంకొండ గణేశ్ మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఈ కథని ఎంచుకుని సాహసం చేశాడు. గత కొన్నేళ్లలో కొంతవరకు తెలుగు సినిమా పంథా చాలా మారిపోయింది. ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటే లాజిక్స్ లేని కథలు కాకుండా చుట్టూ జరిగే చిన్న చిన్న పాయింట్స్ ని తీసుకుని వాటి ఆధారంగా యువ దర్శకులు సినిమాలు తీస్తున్నారు. చాలావరకు హిట్స్ కొడుతున్నారు. అలాంటి వాటిలో మిడిల్ క్లాస్ మెలోడీస్, అశోకవనంలో అర్జున్ కల్యాణం లాంటి సినిమాలు ముందుంటాయి. తాజాగా రిలీజైన ‘స్వాతిముత్యం’ కూడా ఆ తరహా స్టోరీనే. కాకపోతే కథ-కథనం కాస్త డిఫరెంట్!
పైన చెప్పుకున్నట్లే ‘స్వాతిముత్యం’ కథంతా కూడా మన చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది. మన చుట్టూ ఉండే మనుషులే తెరపై కనిపిస్తుంటారు. ఫస్టాప్ అంతా అలా సరదా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ వచ్చే సమయానికి వీర్యదానం అనే పాయింట్ తో దర్శకుడు స్టోరీ మొత్తాన్ని మలుపు తిప్పేశాడు. అలా అని ఈ పాయింట్ కొత్తదేం కాదు. గతంలో హిందీలో ‘విక్కీ డోనర్’ సినిమాను స్పెర్మ్ డొనేషన్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా తీశారు. అందులో హీరో, ప్రొఫెషనల్ గా స్పెర్మ్ డొనేట్ చేస్తుంటాడు. ‘స్వాతిముత్యం’లో మాత్రం హీరో అనుకోకుండా ఓసారి వీర్యదానం చేసి ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ని ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా డైరెక్టర్ లక్ష్మణ్, చాలా ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు.
సరోగసి, వీర్యదానం లాంటి వాటి గురించి తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవడానికి ఆలోచిస్తారు. ఇక వాటి గురించి సినిమా అంటే సీరియస్ గా లెక్చర్ ఇస్తాడేమోనని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఈ విషయాన్ని ఏ మాత్రం ఎబ్బెట్టుగా అనిపించకుండా, ఇదే అంశం చుట్టూ కామెడీని పండిస్తూ స్టోరీని దర్శకుడు ముందుకు తీసుకెళ్లడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఫస్టాప్ లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ వల్ల పెద్దగా కామెడీ జనరేట్ చేయలేకపోయారు. కానీ సెకాండాఫ్ లో మాత్రం గోపరాజు రమణ-రావు రమేశ్ లాంటి వాళ్లతో ఫుల్ గా కామెడీ వర్కౌట్ చేశారు. ప్రేక్షకుల్ని ఆ సీన్స్ అలరించాయి కూడా. వీరికి తోడు వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నరేశ్, శివన్నారాయణ లాంటి తలో చేయి వేయడంతో సినిమా చివరి వరకు ఫన్నీగా వెళ్లిపోతుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. హీరోగా బెల్లంకొండ గణేశ్ కి ఇది తొలి చిత్రం. ఎంట్రీ సినిమాకే ఇలాంటి కథని ఎంపిక చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. కానీ నటనలో మాత్రం తేలిపోయాడు. యాక్టింగ్ విషయంలో చాలా డెవలప్ కావాల్సి ఉంది. ఇక హీరోయిన్ గా ఇప్పటికే పలు సినిమాలు చేసిన వర్ష బొల్లమ్మ.. ఈ సినిమా విషయంలో మొత్తం భారం తనపై వేసుకుంది. తనకిచ్చిన పాత్రని అవలీలగా చేసుకుంటూ పోయింది. ఇక వీరిద్దరి తర్వాత చెప్పుకోవాల్సింది రావు రమేశ్ గురించి. ఆయన కూడా అద్భుతంగా నటించి, ప్రేక్షకులని తెగ ఎంటర్ టైన్ చేశాడు. టెక్నికల్ విభాగం విషయానికొస్తే.. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ కి మ్యూజిక్ బాగుంటేనే ఆడియెన్స్ ఆదరిస్తారు. కానీ ఆ విషయంలో మహతి స్వరసాగర్ నిరాశపరిచాడు. సూర్య సినిమాటోగ్రఫీ బాగుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా దర్శకుడు లక్ష్మణ్ గురించి చెప్పాలంటే.. తొలి సినిమానే అయినా సరే ఎక్కడా తడబాటు లేకుండా సినిమా తీశాడు. రైటింగ్ విషయంలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఇళ్లలో మాట్లాడుకోవడానికే ఇబ్బంది పడే ఓ అంశాన్ని తీసుకుని దాన్ని సినిమాగా తీయడం, అది కూడా ఎక్కడా వల్గారిటీ లేకుండా ఫన్నీ వేలో చెప్పడం చాలా బాగుంది. భవిష్యత్తులో అతడి మంచి దర్శకుడు అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.
చివరి మాట: ఆలోచింపజేస్తూనే నవ్వులు పంచే ‘స్వాతిముత్యం’