Ramabanam Movie Review: చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ తాజాగా రామబాణం అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్స్ అందించిన శ్రీవాస్, గోపీచంద్ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టారు. మరి ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ కొట్టారా? లేదా?
ఒక లక్ష్యం, ఒక లౌక్యం.. ఆ తర్వాత రామబాణం. మ్యాచో స్టార్ గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. కమర్షియల్ గా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. మళ్ళీ వీరిద్దరి కలయికలో లౌక్యం సినిమా వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో వీరిది హిట్ కాంబినేషన్ అయిపోయింది. ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా రామబాణం. టైటిల్ చివర సున్న ఉంటే హిట్ గ్యారంటీ అన్న నమ్మకం ఉంది. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యిందా? గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హ్యాట్రిక్ హిట్ కొట్టారా? లేదా? రివ్యూలో చూద్దాం.
రాజారామ్ (జగపతిబాబు) పుట్టిన ఊర్లోనే ఉంటూ ఒక హోటల్ ను నిర్వహిస్తుంటాడు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే కల్తీ లేని నాణ్యమైన సాంప్రదాయ వంటకాలను తయారు చేసి అమ్ముతుంటాడు. అలా ఊర్లో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతాడు రాజారామ్. అయితే వ్యాపారం అన్నాక శత్రువులు ఉంటారు కాబట్టి వారికి ఎదగడం నచ్చదు. జీకే (తరుణ్ అరోరా) తన మేనమామతో (నాజర్) కలిసి రాజారామ్ హోటల్ పై దౌర్జ్యన్యానికి పాల్పడతాడు. మామా, అల్లుళ్లిద్దరూ హోటల్ లైసెన్స్ తీసుకెళ్ళిపోతారు. రాజారామ్ తమ్ముడు విక్కీ (గోపీచంద్) రాత్రికి రాత్రి జీకే ఇంటిపై దాడి చేసి లైసెన్స్ తీసుకొస్తాడు.
అయితే రాజారామ్ కి ఇది నచ్చదు. ఏం చేసినా చట్టపరంగా చేయాలని అంటాడు. ఇలా చేస్తే జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగమని చెప్పి.. తమ్ముడు విక్కీని పోలీసులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో విక్కీ ఎప్పటికైనా ఉన్నతమైన స్థాయికి ఎదిగి తిరిగి వస్తానని చెప్పి పారిపోతాడు. అలా కలకత్తా వెళ్లిపోయిన విక్కీ 15 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు? రావాల్సిన అవసరం ఏముంది? ఇన్నేళ్లు ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
హీరో కలకత్తా నుంచి ఫ్లైట్ లో ఇండియాలో ల్యాండ్ అవ్వడంతో కథ మొదలవుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్, కలకత్తా పారిపోయి విక్కీ బాయ్ గా ఎదగడం వంటి సీన్లతో కథ సాగుతోంది. యూట్యూబర్ భైరవితో (డింపుల్ హయాతీ) విక్కీ ప్రేమలో పడడంతో కథ మలుపు తిరుగుతుంది. హీరో 15 ఏళ్ల తర్వాత సొంత ఊరు రావడం, అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ ఊహకు అందేలానే ఉంటాయి. చాలా సన్నివేశాల్లో అసలు కొత్తదనమే లేదు. పాత సినిమాల్లో ఉన్న ఫార్ములానే ఇందులో ఇరికించినట్టు అనిపిస్తుంది. అయితే సేంద్రీయ ఆహార ఉత్పత్తుల గురించి ఈ సినిమాలో మంచి సందేశాన్ని ఇచ్చారు. అందుకు దర్శకుడు శ్రీవాస్ ని మెచ్చుకోవాలి. కథ చాలా పాతది. కొత్త కథేమీ కాదు. సేంద్రీయ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహారం నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. అయితే సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటీ లేదు. గుర్తుండిపోయే సన్నివేశాలు లేవు.
ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా అన్నీ ఉన్నాయి. కానీ గుండెకు హత్తుకునే విధంగా ఎమోషన్స్ లేవు. ఇక కమెడియన్స్ ఉన్నారు గానీ హాస్య సన్నివేశాలు సరిగ్గా పేలలేదు. ఫైట్ సీన్లు బాగున్నాయి. విక్కీ, రాజారామ్ ల అభిప్రాయాలు కలవడం, అనంతరం వచ్చే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులని మెప్పిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. గోపీచంద్ ని బాగా చూపించారు. లక్ష్యం సినిమాలో గోపీచంద్ యాక్టింగ్ కి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జగపతిబాబుకి తమ్ముడిగా చాలా బాగా నటించారు. అన్నదమ్ముల అనుబంధం గురించి వచ్చే ఎమోషనల్ సీన్స్ ఎంతగా కనెక్ట్ అవుతాయో చెప్పాల్సిన పని లేదు. అయితే మళ్ళీ అదే కాంబినేషన్ రామబాణంలో రిపీట్ అయ్యింది కానీ ఎమోషన్ రిపీట్ అవ్వలేదు. కథ, కథలో ఎమోషన్ హైలైట్ అవ్వకపోతే సినిమా పేలవంగా ఉంటుంది.
కమర్షియల్ సినిమా కాబట్టి పెద్దగా నిరూపించుకునే అవకాశం ఉండదు. గోపీచంద్ గతంలో కంటే స్టైలిష్ గా కనిపించారు. యాక్షన్ సీన్స్, పాటలతో ఆకట్టుకున్నారు. అయితే పాత్రలో కొత్తదనం కనిపించదు. ఇక రాజారామ్ గా, హోటల్ నిర్వాహకుడిగా జగపతిబాబు సాఫ్ట్ రోల్ లో బాగా నటించారు. హీరోయిన్ డింపుల్ హయాతీ పాత్ర పెద్దగా ఉండదు. డ్యాన్సులు బాగా వేసిందన్న పేరు తప్పితే నటన పరంగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఇక కుష్బూ, నాజర్, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర తదితరులు తమ పాత్ర మేరకు బాగా నటించారు. ఇక అలీ, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సప్తగిరి వంటి వారిని సరిగా ఉపయోగించుకోలేదు దర్శకుడు.
మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫి బాగుంది. సన్నివేశాలు రిచ్ గా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. భూపతిరాజా అందించిన కథలో కొత్తదనం లేదు. డైలాగులు పర్లేదు. సాక్ష్యం సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత చేసిన సినిమా అంటే ఓ రేంజ్ లో ఉండాలి. కానీ దర్శకుడు శ్రీవాస్ మాత్రం అంచనాలను తారుమారు చేశారు. పాత కథని.. అటు తిప్పి, ఇటు తిప్పి రొటీన్ సినిమాగా మలిచారు.
చివరగా: రామబాణం టార్గెట్ మిస్ అయ్యింది
రేటింగ్: 2/5