ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గత కొన్నాళ్ల నుంచి వచ్చిన సినిమాలనే చూసుకుంటే ఎక్కువగా రస్టిక్ మాస్ ఎంటర్ టైనర్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. వాటిలో పుష్ప, KGF లాంటి మూవీస్ చాలా అంటే చాలా క్రేజ్ తెచ్చుకున్నాయి.
ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గత కొన్నాళ్ల నుంచి వచ్చిన సినిమాలనే చూసుకుంటే ఎక్కువగా రస్టిక్ మాస్ ఎంటర్ టైనర్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. వాటిలో పుష్ప, KGF లాంటి మూవీస్ చాలా అంటే చాలా క్రేజ్ తెచ్చుకున్నాయి. పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ ని షేక్ చేసి, వందలకోట్ల కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు ఇదే జానర్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘దసరా’. రిలీజ్ కు ముందే చాలా అంచనాలు పెంచిన ఈ మూవీ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!
వీర్లపల్లి అనే పల్లెటూరు. చుట్టు బొగ్గు కుప్పలు, మైన్స్. ఈ ఊరిలోనే ధరణి(నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల(కీర్తి సురేష్) కలిసి మెలిసి పెరుగుతారు. వెన్నెలని స్కూల్ లో ఉన్నప్పుడే ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా వెన్నెలనే లవ్ చేస్తున్నాడని తెలిసి.. తన ప్రేమని మనసులోనే దాచేసుకుంటాడు. ఆ తర్వాత చాలా భయస్థుడిగా మారిపోయి మందుకు బాగా అలవాటు అయిపోతాడు. ఫ్రెండ్స్ తో కలిసి బొగ్గు దొంగతనం చేస్తూ బతికేస్తుంటాడు. కట్ చేస్తే కొన్నాళ్లకు పెద్దల అంగీకారంతో వెన్నెల, సూరి పెళ్లి చేసుకుంటారు. దీనికి ధరణినే సహాయం చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఊరిలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. చాలా భయపడే ధరణి.. కత్తి పట్టి మనుషుల్ని చంపే స్థాయికి వెళ్లిపోతాడు? ధరణి ఎందుకలా మారాల్సి వచ్చింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మీరు ‘దసరా’ని థియేటర్లలో చూడాల్సిందే.
‘దసరా’.. ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ సినిమా. అలా అని స్టోరీ విషయంలో కత్తి విడిచి సాము చేయలేదు. ఏదో కొత్తగానూ ప్రయత్నించలేదు. మనలో చాలామందికి తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా భయపడే హీరో.. అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల మనుషుల్ని చంపడం అనే పాయింట్ కొత్తేం కాదు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూశాం. కానీ వాటికి దీనికి తేడా ఏంట్రా అంటే ట్రీట్ మెంట్. తీస్తుంది మాస్ సినిమానే అయినా ప్రతి విషయానికి డీటైలింగ్ ఇస్తూ వెళ్లారు. స్టోరీ దగ్గర నుంచి హీరోహీరోయిన్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ధరణి అంటే భూమి, వెన్నెల అంటే చందమామ, సూరి అంటే సూర్యుడు. ఈ మూడు కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి. సినిమాలోనూ వీళ్ల సీన్ ఉందంటే అందులో చాలా సీన్లలో ముగ్గురూ కంపల్సరీగా ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎలాంటి పక్కచూపులు లేకుండా ఏదైతే చెప్పాలనుకున్నారో క్లియర్ గా అదే చెప్పారు. సినిమాలో ఫుల్ యాక్షన్ ఉంటుంది కదా అని అనుకోని మాత్రం వెళ్లకండి. ఒకవేళ అలా అయితే మాత్రం కచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే యాక్షన్ కంటే డ్రామా, ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. చెప్పాలంటే అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.
ఫస్టాఫ్ విషయానికొస్తే.. వీర్లపల్లిలోని సిల్క్ బార్ లో ఊరి వాళ్లందరూ మందు తాగుతుంటారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేస్తున్నాం అని చెప్పడం టీవీలో వస్తుంది. ఇది చూసి మందుబాబులకు షాకవుతారు. ఆ తర్వాత నుంచి వీర్లపల్లిలో రాజకీయాలు షురూ అవుతాయి. ఇలా తొలి భాగం అంతా కూడా వీర్లపల్లి, అందులోని మనుషుల మనస్తత్వాలు, కులాల మధ్య తేడాలో ఇలా ఒక్కొక్కటి చూపిస్తూ పోయారు. ధరణి, సూరి, వెన్నెల క్యారెక్టర్స్ చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. చెప్పాలంటే ఫస్టాఫ్ లో ధరణి పాత్ర కంటే సూరినే ఎక్కువగా హైలైట్ అవుతాడు. ఇక సూరి-వెన్నెల పెళ్లి ఫిక్స్ కావడానికి ధరణినే హెల్ప్ చేస్తాడు. తీరా పెళ్లి జరుగుతున్న టైంలో ఓ చోటకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికే స్టోరీలో హీరో ట్రిగర్ అయ్యే పాయింట్ వస్తుంది. అప్పుడే ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అయితే ఇంటర్వెల్ లో ఫైట్ ఉంటుందని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అలాంటిదేం లేకుండా ‘విరామం’ అని పడుతుంది.
ఫస్టాఫ్ అంతా ఆల్మోస్ట్ డ్రామాతో నడిపించేశారు. సెకండాఫ్ కి వచ్చేసరికి అటు ఎమోషన్ తో పాటు యాక్షన్ ని నమ్ముకున్నారు. ధరణి పాత్రలో అసలు సిసలైన మాస్ ని ఒక్కో సీన్ తో ఎలివేట్ చేస్తూ వెళ్లారు. వెన్నెలని ఏడిపించారని ఊరిలోని ఓ వ్యక్తిని దాదాపు చంపేవరకు ధరణి వెళ్తాడు. అక్కడే విలన్ చిన నంబికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.. ‘దసరా’ డైరెక్టర్. అందుకేనేమో ఏమోగానీ.. ఓ రెండు సీన్స్ లో సుకుమార్ తీసిన ‘రంగస్థలం’ షేడ్స్ కనిపిస్తాయి. బార్ లోకి నాని ఎంట్రీ సీన్.. రంగస్థలంలో జగపతిబాబుకి రామ్ చరణ్ వార్నింగ్ సీన్ తో కాస్త పోలినట్లు అనిపిస్తుంది. ‘దసరా’ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ ఎమోషనల్ సాంగ్.. ‘రంగస్థలం’లోని ‘ఓరయ్యో.. ‘ పాటని గుర్తు చేస్తుంది. ఇది తప్పించి మిగతా ఎక్కడా కూడా మనకు వేరే ఏం గుర్తుకురాదు. దసరా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటివరకు ధరణి ఎప్పుడు ఫైట్ చేస్తాడా అని ఆడియెన్స్ ఒకటే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలైతే మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలా ఉంటుంది ఆ ఫైట్. ఎక్కువ చెబితే మళ్లీ స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి థియేటర్ లో ఆ క్లైమాక్స్ ఫైట్ ని ఎక్స్ పీరియెన్స్ చేయండి. మీకు రోమాలు నిక్కబొడుచుకోకపోతే నన్ను అడగండి.
ఈ సినిమా చూడగానే మీకు నాని, కీర్తి సురేష్ తెగ నచ్చేస్తారు. ఇప్పటివరకు వీళ్లిద్దరూ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారు కానీ ‘దసరా’ మాత్రం వీళ్ల కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్. నాని యాక్టింగ్ అయితే ఫ్యాన్స్ ని చాలా అంటే చాలా సర్ ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ లో విలన్లని చంపుతుంటే.. రాముడు చేసిన రావణ సంహారం గుర్తొస్తుంది. నానికి మీరు ఫిదా అయిపోతారు. దీక్షిత్ శెట్టి, సూరి రోల్ కి ఎంత కావాలో అంత ఫెర్ఫెక్ట్ గా జీవించేశాడు. మిగిలిన వారిలో చిన నంబి క్యారెక్టర్ చేసిన మలయాళ నటుడు సైన్ టామ్ చాకో గురించి చెప్పుకోవాలి. ఓ విలన్ ఎంత కృూరంగా ఉంటాడనేది చిన నంబి రోల్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సాయికుమార్, సముద్రఖని లాంటి అద్భుతమైన నటులు ఉన్నప్పటికీ వాళ్లకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగానే దొరికింది. ధరణి-సూరి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ పై చాలామంది కనిపిస్తుంటారు. అదే టైంలో డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ ఎవరు? అని మైండ్ లో అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంత అద్భుతంగా రఫ్ఫాడించారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలకు ‘దసరా’నే ఫస్ట్ సినిమా. కానీ మూవీ చూస్తున్నంతసేపు ఏ పాయింట్ లోనూ అలా అనిపించదు. పది సినిమాల ఎక్స్ పీరియెన్స్ ఉన్న డైరెక్టర్ లా సినిమాని హ్యాండిల్ చేశాడు. హీరోహీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ విషయంలో ఇచ్చిన డీటైలింగ్ అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. శివతాండవం ఆడేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ సీన్, ఎమోషనల్ సీన్.. దేనికి ఎంత కావాలో అంతే ఫెర్ఫెక్ట్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రఫర్ సత్యన్ సూర్యన్.. బొగ్గులోనూ అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టి అదరగొట్టాడు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే.. థియేటర్లలో ‘దసరా’తో ప్రేక్షకులకు మాస్ జాతర!
చివరగా: ‘దసరా’.. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ బిగిలు!
రేటింగ్: 3/5