ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, ఆ స్థలాల్లో నివాసాలు, ఇతర కార్యకలాపాలు చేపట్టడం నేరం. అటువంటి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ ఉంటుంది. కానీ తమ భూమిని ఖాళీ చేయాలని రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులు ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రభుత్వ భూములను ఆక్రమించడం నేరం. ఆ భూముల్లో నివాసాలు ఏర్పరుచుకోవడం, వ్యాపార కార్యక్రమాలు చేపట్టడం చట్టవిరుద్ధం. అటువంటి స్థలాల నుండి ప్రజలను ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఆక్రమిత స్థలాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వారికి పునారావసం వంటి ఏర్పాటు చేయోచ్చు, చేయనూ పోవచ్చు. ఈ ధోరణికి ఎక్కువగా రైల్వే శాఖ ప్రభావితం అవుతుంది. రైల్వే స్థలాల్లో, రైల్వే ట్రాక్ ల వెంబడి నివాసాలను ఏర్పాటు చేసుకున్న వారిని తొలగిస్తూ ఉంటుంది. అయితే రైల్వే పనుల నిమిత్తం ఓ స్థలాన్ని ఖాళీ చేయాలని విచిత్రమైన నోటీసు పంపి వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్ రైల్వే శాఖ.
ఇంతకూ ఆ నోటీసు పంపిందీ ప్రజలకు కాదూ దేవుడికి. ఆ దేవుడికా.. అనుకుంటున్నారా.. అవునండి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మొరెనాలో జిల్లాలోని సబల్ గఢ్ లో అధికారులు కొత్తగా రైల్వే లైనును నిర్మిస్తున్నారు. గ్వాలియర్-షియోపూర్ మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ లైన్లో ఓ హనుమంతుడి గుడి ఉంది. ఈ గుడి రైల్వే భూమిలో ఉందన్న అధికారులు.. తక్షణమే ఖాళీ చేయాలంటూ ఏకంగా దేవుడికే నోటీసులు జారీ చేశారు. దేవుడి పేరు మీదే నోటీసులు ఇచ్చారు. ఈ గుడిని ఆంజనేయుడు ఆక్రమించుకున్నారని పేర్కొనడం గమనార్హం. ఏడు రోజుల్లో ఈ ఆక్రమణను తొలగించాలని లేదంటే, రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటాయని కూడా నోటీసులో హెచ్చరించింది.
అంతేకాకుండా ఈ ఆక్రమణ తొలగింపుకు వినియోగించే జెసిబి ఖర్చును కూడా హనుమంతుడి నుండి వసూలు చేస్తామని చెప్పడం విశేషం. హనుమంతుడికి ఇచ్చిన నోటీసు కాపీని గ్వాలియర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, జిఆర్పీ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ కూడా పంపారు. కాగా, ప్రస్తుతం ఈ నోటీసు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఝాన్సీ రైల్వే డివిజన్ పీఆరోవో మనోజ్ మథూర్ స్పందిస్తూ .. గుడి యజమానికి పంపాల్సిన నోటీసు, దేవుడి పేరుతో పంపారని, పొరపాటున ఇది జరిగిందని వ్యాఖ్యానించారు. దేవుడికే నోటీసులివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.