పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని అంతా వినే ఉంటారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు ఎన్నో రకాల రుచులను చూసే ఉంటారు. ఇప్పుడు ఫుడ్ వ్లాగ్స్ కూడా బాగా ఫేమస్ అయిపోయాయి. ఎక్కడో మారు మూల ఉన్న వంటకాలను కూడా యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. కొందరైతే వారి స్పెషల్ రెసిపీలను నెట్టింట పెట్టి ఫేమస్ అవుతున్నారు. కానీ, అన్నీ మనకు అంత వింతగా విచిత్రంగా అనిపించవు. కానీ, కొన్ని మాత్రం వీక్షించేందుకే కాదు.. రుచి చూసేందుకు కూడా కాస్త విచిత్రంగా ఉంటాయి. కొన్నైతే ట్రై చేయాలంటే భయం కూడా కలుగుతుంది. అలాంటి ఒక వంటకం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు అలా ఎలా చేశారంటూ ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు.
ఆ వంటకం మరేదో కాదు పకోడి. పకోడీలో వింత ఏముంది? ఎప్పుడూ తినేదేగా అంటారా? వింత ఉందండి బాబూ. మీకు ఉల్లిపాయ పకోడీ తెలుసు, చికెన్ పకోడీ తెలుసు, పల్లీ పకోడీ తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం డైరీమిల్క్ చాక్లెట్ పకోడి. అవును మీరు చదివింది కరెక్టే.. ఇప్పుడు చెప్పుకోబోయేది డైరీమీల్క్ చాక్లెట్‌తో చేసే పకోడీ గురించే. ఒక మహిళ రోడ్ సైడ్ బండి పెట్టుకోని ఈ చాక్లెట్ పకోడీ విక్రయిస్తోంది. డైరీమిల్క్ చాక్లెట్ తీసుకుని పకోడీ కోసం కలిపిన పిండిలో మొత్తం చాక్లెట్‌ని ముంచి సలసలకాగే నూనెలో వేసి బాగా వేయించి తీసి కస్టమర్లకు వేడిగా సర్వ్ చేస్తోంది. అంతేకాకుండా ఆ చాల్కెట్ పకోడీలోకి మింట్ చట్నీ కూడా ఇవ్వడం విశేషం. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
అందరూ ఈ చాక్లెట్ పకోడీ గురించి విని షాకవ్వడమే కాదు.. చూసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ లవర్స్ అంతా ఈ వీడియో షేర్ చేయడమే కాదు కామెంట్స్ కూడా చేస్తున్నారు. సూపర్‌గా ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ హితవు పలుకుతున్నారు. వేడి నూనెలో అలా చాక్లెట్ వేయించడం మంచిది కాదని చెబుతున్నారు. అంతేకాకుండా అంత చాక్లెట్ ఒకేసారి తింటే షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. చల్లగా తినాల్సిన చాక్లెట్ అని ఫ్రై చేసుకు తింటారా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పకోడీ అనేది కారంగా ఉండాలి గానీ.. ఇలా తీయగా తింటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.