అదృష్టం ఉంటే మిన్ను విరిగి నెత్తిన పడినా ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడొచ్చు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. వీడియో ఆధారాలు ఉన్న కొన్ని వందల సంఘటనలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా, జరిగిన ఓ సంఘటన కూడా వీడియో రికార్డు అయింది కాబట్టి నమ్మాల్సి వస్తోంది.. లేదంటే ఆ విషయాన్ని ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే.. ఆ వీడియోలో జరిగిన సంఘటన అలాంటిది. ఓ టిక్కెట్ కలెక్టర్ హైటెన్షన్ వైర్ మీదపడ్డా కూడా ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆ వైర్ల ప్రభావం ఎంత ఉంటుందంటే.. ఐ సినిమాలో హీరో విక్రమ్.. విలన్‌ను హై టెన్షన్ తీగను పట్టుకునేలా చేస్తాడు. దీంతో ఆ విలన్ శరీరం యాసిడ్‌లో ముంచినట్లు కరిగిపోతుంది. అంతటి ప్రమాదకరమైన ఆ హై టెన్షన్ వైర్లు టిక్కెట్ కలెక్టర్ మీద పడ్డా గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ ఇద్దరు టికెట్ కలెక్టర్లు ప్లాట్ ఫాం మీద నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. కొన్ని నిమిషాల తర్వాత అనుకోని ఓ భయంకరమైన సంఘటన జరిగింది. అలా జరుగుతుందని వారు కల్లో కూడా ఊహించి ఉండరు. వారు ఎంతో శ్రద్ధగా మాట్లాడుకుంటూ ఉండగా..
ఓ హైటెన్షన్ వైరు పట్టాలకు దగ్గరగా ఉన్న టికెట్ కలెక్టర్‌పై పడింది. దీంతో అతడి పరిస్థితి మస్కిటో బ్యాట్ మీద పడ్డ దోమలాగా అయింది. పట్ పట్ అంటూ పెద్ద సౌండ్లు, మంటలతో అతడు నేల కూలాడు. నేరుగా పట్టాలు, ప్లాట్ ఫాం సందులో పడిపోయాడు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న మరో టికెట్ కలెక్టర్ త్రుటిలో తప్పించుకున్నాడు. అక్కడినుంచి పరుగులు తీశాడు. కొద్ది సేపటి తర్వాత పట్టాలపై పడ్డ టికెట్ కలెక్టర్‌కు గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#Watch | Miraculous Escape For Bengal Ticket Collector After Live Fire Fell On Him https://t.co/FFMFDxuvkC pic.twitter.com/XOUbi76bGJ
— NDTV (@ndtv) December 8, 2022