దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం.. డీఏ పెంపుపై ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా రెండు డీఏలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 1న జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పెంపుతో ఏ పే స్కేల్ ఉద్యోగులకు ఎంత శాతం డీఏ పెరిగింది? పెంచిన సొమ్ము ఏ నెల జీతంతో కలిసి రాబోతోంది?
దసరా పండుగ శుభవేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జనవరి 2024 నుంచి అమలులోకి వచ్చేలా ఉద్యోగుల డీఏను 37.31 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వివిధ పే స్కేళ్ల ఉద్యోగులకు వేర్వేరు నిష్పత్తుల్లో డీఏ పెంపు వర్తించనుంది. ఇందులో భాగంగా 2015 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 81.72 శాతానికి, 2020 పే స్కేల్ ఉద్యోగులకు 40.04 శాతానికి పెంచారు. అదేవిధంగా 2016 పే స్కేల్ వారికి 53 శాతానికి, 2006 పే స్కేల్ ఉద్యోగులకు ఏకంగా 246 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.”
కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్ పరిధిలోకి వచ్చే అధ్యాపకులు, ఉద్యోగులకు కూడా ఈ డీఏ పెంపు నిర్ణయం యథాతథంగా వర్తించనుంది. ఇక ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పెంచిన డీఏ డబ్బుల చెల్లింపు సమయం కూడా ఆసన్నమైంది. పెంచిన ఈ డీఏను అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. అంటే వచ్చే నవంబర్ 1వ తేదీన ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో పెరిగిన జీతంతో పాటు ఈ డీఏ బకాయిల మొత్తం నేరుగా జమ కానుంది.”
ఇక డీఏ బకాయిల చెల్లింపు విషయానికి వస్తే.. ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. ఉద్యోగులకు రావలసిన డీఏ బకాయిలను మొత్తం 33 వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జూలై 2024కి సంబంధించిన డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నారు. ఈ బకాయిల మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. జీపీఎఫ్ లేని వారికి ప్రత్యామ్నాయ నియమావళి ప్రకారం ఈ చెల్లింపులు జరగనున్నాయి.”
“పండుగ వేళ ప్రభుత్వం రెండు డీఏలను మంజూరు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
