మనిషి తత్వమే మానవత్వం.. ఒక మనిషిలో జీవం లాగా మానవత్వం కూడా ఉండాలి. కానీ, అలా జరగటం లేదు. మానవత్వం నశించిపోతోంది. స్వార్థం కోసం తప్పులు చేసే వారే ఎక్కువయిపోయారు. సాటి మనిషికి విలువ ఇచ్చే వారు కరువయ్యారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కూడా కష్టం అయిపోయింది. అయితే, వీటన్నింటికి అతీతంగా కొంతమంది మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా, తిండి, తిప్పలు లేకుండా అల్లాడుతున్న ఓ మహిళకు ఓ సీఐ అండగా నిలిచారు. ఆమె గురించి తెలిసిన వెంటనే సహాయం చేయటానికి పూనుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలంలోని జక్లేర్ చౌరస్తాలోకి కొద్దిరోజుల క్రితం ఓ మానసిక స్థితి సరిగాలేని మహిళ వచ్చింది. తిండి తిప్పలు లేకుండా మూడు రోజులుగా అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆకలి, దప్పులతో చాలా కష్టాలు పడుతోంది. ఆమె ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. జక్లేర్ గ్రామానికి చెందిన రవి అనే యువకుడు, గ్రామస్తులు ఆమె పరిస్థితి గమనించారు. మక్తల్ పోలీస్ స్టేషన్‌ను సీఐ సీతయ్యకు విషయం చెప్పారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. సీతయ్య ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చారు.
108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. అనంతరం దీనిపై సీతయ్య మాట్లాడుతూ.. మహిళ తన వ్యక్తిగత వివరాలు చెప్పలేకపోతోందని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. ఇక, సీఐ వార్త సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఆయన మంచితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ఆయన్ని ముంచెత్తుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.