మీడియా ఫీల్డులో సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిరంతర కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. నేడు సుమన్ టీవీలో న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.
జర్నలిజం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా రిపోర్టింగ్ పెను సవాళ్లతో కూడుకున్న ఓ క్లిష్టమైన బాధ్యత. రిపోర్టింగ్ చేసే వ్యక్తి.. కాళ్లకు చక్రాలు కట్టుకుని అక్కడికీ ఇక్కడికీ పరిగెత్తుతూ ఉండాలి. రాముడి ఉంగరంతో సీత దగ్గరకు వెళ్లిన హనుమంతుడిలా.. మనం చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. ప్రమాదం అని తెలిసినా అడుగు ముందుకు వేయాలి. జనానికి నచ్చేలా.. వారు మెచ్చేలా సమాచారాన్ని అందజేయాలి. ఇంత రిస్క్ ఉన్న ఈ ఫీల్డులో ది బెస్ట్ అనిపించుకోవటం చాలా కష్టం. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే ఈ కష్టాన్ని తమ ప్యాషన్‌తో ఇష్టంగా మార్చేస్తున్నారు.
అలాంటి వారిలో సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ ఒకరు. టీవీ9లో రిపోర్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిరుపమ.. తర్వాతకాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మూడేళ్ల క్రితం రిపోర్టర్‌గా సుమన్ టీవీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సంస్థలో తన ప్రయాణం మొదలైన తొలినాటి నుంచి నేటి వరకు నిరంతరం శ్రమిస్తూ.. ప్రజలకోసం, నిష్పక్షపాతంగా పనిచేస్తూ డిజిటల్ మీడియాలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. అలాంటి నిరుపమ నేడు సుమన్ టీవీ న్యూస్ ఎడిటర్‌గా ప్రమోట్ అయ్యారు.
నిరుపమ తాను రిపోర్టింగ్ చేసే అంశాల్లో అవేర్‌నెస్, ఎడ్యుకేషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా జోడించి జర్నలిజంలో ఓ కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. రిపోర్టర్‌గా అన్ని విషయాలను.. అత్యంత వేగంగా ప్రజలకు చేరవేయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో ఆమెకు సుమన్ టీవీ లాంటి ఓ డిజిటల్ జెయింట్ ప్లాట్ ఫాం అవ్వటంతో రిపోర్టర్‌గా మరింత దూసుకుపోయారు. సమాజంలో ఉండే సమస్యలను ధైర్యంగా ప్రశ్నించటమే కాక, మానవతా కోణంలో మంచి కార్యక్రమాలను కవర్ చేయటంలోనూ నిరుపమకు సాటిలేరు. ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు నిరుపమ తెలియని సోషల్ మీడియా యూజర్ లేరని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా ప్రజల్లోకి వెళ్లిపోయారామె. సత్తా ఉన్న వారిని గుర్తించి, ప్రోత్సహించటంలో ఎప్పుడూ ముందుండే సుమన్ టీవీ యజమాన్యం ఆమెను రిపోర్టర్ నుంచి న్యూస్ ఎడిటర్‌గా ప్రమోట్ చేయటం విశేషం.
పని చేసే వారిలో ప్రతిభ ఉండటం ఎంత ముఖ్యమో.. దాన్ని గుర్తించే యజమాన్యం ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో సుమన్ టీవీ ఎప్పటికీ ది బెస్ట్. ప్రతిభకు పట్టం కట్టడంలో సుమన్ టీవీ CEO, Chairman సుమన్ ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా మహిళా ఆదరణ ఎక్కువగా ఉన్న సుమన్ టీవీ నెట్‌వర్క్‌లో మహిళా ఉద్యోగుల ఎదుగుదలకు ఎప్పుడూ మంచి అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పుడు నిరుపమ నిలిచారు. ప్రతిభతో పాటు కష్టపడే తత్వం ఉన్న నిరుపమ తాను ఎంచుకున్న రంగంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ.. నేడు ఈ స్థాయికి చేరుకోవటం అభినందనీయం. ఇక, సుమన్ టీవీ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎడిటర్ నిరపమ మాట్లాడుతూ.. రానున్న కాలంలో కూడా సుమన్ టీవీ న్యూస్ సామాన్యుడికి అండగా నిలుస్తూ.. నిస్పక్షపాతంగా పని చేస్తూ.. నిజాలను నిర్భయంగా అందిస్తుందని అన్నారు.