సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురు యువతి, యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. ఈ ఘటనతో వారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన వెనుక కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలో ఏకంగా ఆరుగురు అమాయక యువతి, యువకులు అగ్నికి ఆహూతయ్యారు. పొట్ట చేత బట్టుకుని నగరానికి వచ్చి.. కన్నవాళ్ల కష్టాలు తీర్చకముందే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. అభం, శుభం తెలియని అభాగ్యులు పాతికేళ్లు కూడా నిండకుండానే పరలోకాలకు వెళ్లిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయితే పేరుకు కాల్ సెంటర్ గా నడుస్తున్నా.. దీని వెనుక కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే?
ఆ రోజు ఏం జరిగిందంటే?
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జీఎం5 సంస్థ పేరుతో వీరు కాల్ సెంటర్ నడిపిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఆ ఆరుగురు యువతి, యువకులు ఈ సంస్థలో ఏజెంట్లుగా పని చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన రోజు ఉద్యోగులు అంతా ఘటనకు 20 నిమిషాల ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన కూడా మేనేజర్లుగా పని చేస్తున్న ప్రమీల, పద్మ, వెన్నెల, త్రివేణి, శివ, ప్రశాంత్ ఈ ఆరుగురు ఆఫీసులోనే ఉన్నారు. ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అంటుకున్నాయి. ఆ సమయంలో వారికి ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియక.. చివరికి మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో నమ్మలేని నిజాలు:
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో బీఎం5 సంస్థ పేరుతో జరుగుతున్న కొన్ని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేరుకే కాల్ సెంటర్ అయినా.. పేరుతో తెర వెనుక ” క్యూనెట్ ” భారీ మోసాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులు 40 మంది నిరుద్యోగులకు గాలం వేసినట్లుగా సమాచారం. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్స్ (ఎంఎల్ఎం) పేరుతో ముందుగా వీరు సంస్థలో చేరే ముందు రూ.1.5 నుంచి 3 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. వీళ్ళంతా ఆ సంస్థలో చేరిన అనంతరం ముందుగా చేరిన వారు ఇద్దరు సభ్యులను చేర్పించాలి. అలా కొత్తవారిని చేర్పిస్తే మేనేజర్లకు కమిషన్ ఇస్తారు. వీరు చేరే ముందు అడ్వాన్సుగా రూ.30 వేల నుంచి 40 వరకు చెల్లించాలి.
దీంతో సభ్యులుగా చేరిన వారికి సంస్థ నుంచి రూ. 50 వేల ఖరీదైన వాచ్ అని చెప్పి.. కేవలం రూ.2 వేల విలువైన వాచ్ ను, డిన్నర్ సెట్ వంటివి చేరిన సభ్యుల చేతికి అందిస్తారు. ఇలా ఎంత మందిని చేర్పిస్తే వారికి అంత కమిషన్ లెక్కన చేర్పిస్తారని ఉద్యోగులు తెలిపారు. అయితే బీఎం5 పేరుతో కాల్ సెంటర్ నడుపుతూ.. లోలోపల క్యూనెట్ పేరుతో భారీ మోసం జరుగుతోందని ఉద్యోగులు వివరించారు. అంతేకాకుండా సభ్యులు చేరేముందు ఉద్యోగం మధ్యలో వెళ్లబోమని బాండ్ రాయించుకుని, చాలి చాలని జీతాలు ఇస్తున్నారని ఉద్యోగులు నమ్మలేని నిజాలు తెలిపారు. ఇక ఇంతటి మోసానికి పాల్పడుతున్న ఈ సంస్థ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఉద్యోగులు వాపోతుతున్నారు.