మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఇంటర్ విద్యార్థి సాత్విక్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై తాజాగా కాలేజీ యాజమాన్యం స్పందించింది.
హైదరాబాద్ నర్సింగిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ గదిలో ఉరి వేసుకున్న విషయం విదితమే. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాత్విక్ మరణంపై స్పందించిన అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే మా కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏకంగా శ్రీచైతన్య కాలేజీ ముందు బైటాయించి ధర్నా నిర్వహించారు. మా కొడుకు మరణానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు సైతం స్పందిస్తున్నాయి.
అయితే ఈ నేపథ్యంలోనే శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం తాజాగా స్పందించింది. సాత్విక్ మృతి బాధకరమని తెలిపింది. అతని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామంటూ కాలేజీ యాజమాన్యం హామీ ఇచ్చింది. అంతేకాకుండా టీచర్లు కొట్టారనే విషయం మా వరకు ఇంకా రాలేదని, అలా జరిగితే వారి పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇకపోతే సాత్విక్ ఆత్మహత్మ ఘటనపై అతని స్నేహితులు కొన్ని సంచలన నిజాలు వెల్లడించారు.
సాత్విక్ ను టీచర్లు క్లాస్ రూమ్ లోనే ఫెయిల్యూర్, ఫెయిల్యూర్.. అంటూ హేళన చేసేవారని, టీచర్ల వేధింపులు భరించలేకే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. ఇకపోతే మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో హాస్టల్ లోని తన గదిలో సాత్విక్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనంతరం తోటి విద్యార్థుల ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు ముగ్గురు లెక్చలర్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం.