అంతుచిక్కని వ్యాధి ఆ కుటుంబంతో రాక్షస క్రీడ ఆడింది. ఒకరి తర్వాత ఒకరిని బలి తీసుకుంది. దాదాపు 40 రోజుల వ్యవధిలో ఓ కుటుంబం మొత్తం బలైపోయింది. భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. కొన్ని నెలల ముందు వరకు ఎంతో కలకల్లాడిన కుటుంబం ఇప్పుడు విలవిలబోతోంది. కుటుంబాన్ని మొత్తం నాశనం చేసిన ఆ వ్యాధి ఏంటో అర్థం కాక ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటుంటే.. అటు సామాన్య జనాలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లాలోని గంగాధరకు చెందిన వేముల శ్రీకాంత్‌ది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం. భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్తో వాగు ఒడ్డున ఉన్న ఇంట్లో హాయిగా జీవించేవాడు.
నిత్యం పిల్లల నవ్వులతో.. భార్య అనురాగంతో ఇక, ఈ జీవితానికి ఇది చాలు అనుకునే వాడు. అలాంటి ఇంటి మీద ఏ దుష్టశక్తుల కన్ను పడిందో తెలియదు కానీ, ఒక్కసారిగా అలజడి మొదలైంది. నెలరోజుల క్రితం అద్వైత్కు విరోచనాలు, వాంతులు మొదలయ్యాయి. అతడి ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. కుమారుడి మరణంతో కుటుంబంలో మిగిలిన ముగ్గురు తల్లడిల్లిపోయారు. అయితే, ఆ బాధలో ఉండగానే ఇంకో విషాదం వారిని వెంటాడింది. రోజుల వ్యవధిలోనే అమూల్య అనారోగ్యం బారిన పడింది. వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ పాప మరణించింది. ఉన్న ఇద్దరు పిల్లలు మరణించటంతో దంపతులకు తీరని శోకం మిగిలింది.
జీవితం కూడా నరకంలా తోచసాగింది. శ్రీకాంత్, మమత కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ విషాదం అంతటితో ఆగలేదు.. అమూల్య కర్మకాండలు పూర్తయిన వెంటనే ఆ వింత వ్యాధి శ్రీకాంత్ భార్యను చేరింది. మమతకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో శ్రీకాంత్ భార్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఇలా నెల రోజుల వ్యవధిలో ముగ్గురు కుటుంబసభ్యులు మరణించటంతో శ్రీకాంత్ బాధకు అంతులేకుండా పోయింది. అయితే, ఆ వింత వ్యాధి కుటుంబంలోని చివరి వ్యక్తిని కూడా వెంటాడింది. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్ కూడా వాంతులు, విరేచనాల బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మరి, 40 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలి కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.