ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనోవేదనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాలు వచ్చే సమయంలో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతుంటారు.
ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకం. ఇంటర్ లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారి ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుంది. మెడిసిన్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా మ్యాథ్స్ అండ్ సైన్స్ విద్యార్థులు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలను రాబట్టగలుగుతారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మొదటికే మోసం అవుతుంది. ఏడాదంతా కష్టపడి చదివి తీర పరీక్షల సమయంలో ఒత్తిడికి గురై పరీక్షలు బాగా రాయనపుడు విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. ఇంకొంతమంది పరీక్షలు బాగా రాసినప్పటికి మార్కులు తక్కువగా వస్తాయోమోనని ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తీర ఫలితాలు వెలువడిన తరువాత ఫస్ట్ క్లాస్ లో పాసైతరు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కన్నవారికి కడుపుకోత మిగిల్చి పోతారు. ఇలాంటి ఘటనే ఓ విద్యార్థి జీవితంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ ఇంటర్ విద్యార్థి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడ గుట్ట తండాకు చెందిన గుగులోతు కృష్ణ అనే ఇంటర్ ద్వితీయ సంత్సరం విద్యార్థి పరీక్షలు రాశాడు. ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి కృష్ణలో ఒక రకమైన ఆందోళన మొదలైంది.. తాను పాస్ అవుతానా..? మంచి మార్కులు వస్తాయా? అన్న ఆలోచనలో పడిపోయాడు. ఈ క్రమంలోనే పరీక్షల్లో మంచి మార్కులు రావని భయపడి ఏప్రిల్ 10న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ.. తనకు పరీక్షల్లో మంచి మార్కులు రావని, ఎంసెట్ లో మంచి ర్యాంకు పొందలేనని తనను క్షమించాలని కోరుతూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న తమ కొడుకు అర్థంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇదిలా ఉంటే ఈ రోజు మంగళవారం, మే 9న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కృష్ణకు బైపిసిలో 892/1000 మార్కుల సాధించి ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణుడయ్యాడు. ఫలితాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకా మార్కులు రావనే అనుమానంతో తనువు చాలిస్తివి.. ఇప్పుడు ఇన్ని మార్కులతో పాసైతివి అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. కాబట్టి విద్యార్థులు పరీక్షల్లో తప్పితేనో, మార్కులు తక్కువగా వస్తేనో జీవితంలో ఓడిపోయినట్టు కాదు. గురువులు, తల్లిదండ్రుల సలహాలతో ప్రయత్నంలో లోపాలను సరిచేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అప్పుడే నూరేళ్ల జీవితానికి సార్థకత లభిస్తుంది.