తెలంగాణ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నలు మూలాలనుంచే కాక దేశ నలుమూలలనుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో జనం దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి వెళ్లటానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బస్సులు నడుపుతున్నా అవి సరిపోవటం లేదన్న వాపోతున్నారు. అయితే, యాదాద్రి దేవాలయం వరకు రైల్వే ట్రాక్ ఉన్నా అందులో సర్వీసులు నడవటం లేదు.
ఈ ట్రాక్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్ సర్వీసులు నడపాలన్న డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఎమ్‌ఎమ్‌టీఎస్ రెండో దశపై దృష్టి సారించింది. మంత్రి కేటీఆర్ కూడా రెండో దశ రైల్వేపై స్పందించారు. ఇక, రెండో దశ రైల్వే లైను నిర్మాణంలో భాగంగా సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు జరగనున్నాయి. ఘట్‌కేసర్‌నుంచి యాదాద్రి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 32 కిలోమీటర్లు కూడా లైను నిర్మాణం జరిగితే బాగుంటుందని భక్తులు భావిస్తున్నారు.
ఇక, ఈ రైల్వే లైన్ కోసం 330 కోట్లు ఖర్చు అవుతుందని గతంలో అంచనా వేయటం జరిగింది. ఇందుకు రైల్వే శాఖ 110 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాలుగా 220 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ లైను కోసం 200 కోట్లు కేటాయిస్తామని కేటీఆర్ ఇటీవలే ఓ ప్రకటన కూడా చేశారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా ఘట్‌కేసర్‌నుంచి యాదాద్రికి రైలు లైను ఏర్పాటు అయితే.. రూ. 15 టిక్కెట్‌తో దైవ దర్శనానికి వెళ్లొచ్చు. ఎక్కడెక్కడినుంచో దైవ దర్శనానికి వచ్చే భక్తులకు పెద్ద వ్యయ ప్రయాస తప్పుతుంది.