కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితంలో ఆ మాటలు అక్షర సత్యమయ్యాయి. అప్పటి వరకు ఆనందంగా, జీవితం సంతోషంగా సాగిపోతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో మంచి జీతం, గతేడాదే పెళ్లి కూడా జరిగింది. గ్రూప్- 1 మెయిన్స్ కి కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. సరదాగా గడిపేందుకు వెళ్లిన అతను.. తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. సంతోషాలు వెల్లివిరియాల్సిన ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్ నగర్ లో రాముని రవీందర్ నివాముంటున్నారు. ఆయన చిన్న కుమారుడు వంశీకృష్ణ(27) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతేడాది జూన్ 23న అతనికి కర్మాన్ ఘాట్ కు చెందిన యువతితో వివాహం జరిగింది. అతను గ్రూప్-1 మెయిన్స్ కి కూడా సెలక్ట్ అయ్యాడు. అతను భార్య- ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాకి వెకేషన్ కు వెళ్లాడు. మలేషియాలో సరదాగా గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బాలికి వెళ్లారు. వాళ్లు అక్కడికి వెళ్లకుండా ఇంటికి వచ్చినట్లయితే ఇంత ఘోరం జరిగేది కాదేమో.
వంసీకృష్ణ ఈ నెల 22న బాలిలో ఉండే సముద్ర గర్భంలోని అక్వేరియం చూసేందుకు ఒంటరిగా వెళ్లాడు. అక్కడి నిర్వాహకుల సూచనల మేరకు వంశీకృష్ణ ఆక్సిజన్ సిలిండర్, డైవింగ్ స్లిప్పర్స్ అన్నీ ధరించాడు. కానీ, ఎక్కడ పొరపాటు జరిగిందో ఎవరికీ తెలియలేదు. అక్వేరియం చూడటానికి వెళ్లిన వంశీకృష్ణ ఎంతకీ తిరిగిరాలేదు. అతని భార్య నిర్వాహకులను అడగ్గా వంశీకృష్ణ గల్లంతైనట్లు భావించారు. నిర్వాహకులు వెంటనే వంశీకృష్ణ కోసం గాలించారు. సముద్రం గర్భంలో అతను విగతజీవిగా వారికి కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వంశీకృష్ణని పరిశీలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. సముద్ర గర్భంలోకి వెళ్లిన తర్వాత ఒకవేళ వంశీకృష్ణ భయపడి ఉండవచ్చని, అందువల్ల అతనికి గుండెపోటు వచ్చి మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమిక సమాచారంగా చెప్పారట. వంశీకృష్ణ మృతి వార్త అందుకున్న తల్లిదండ్రులు బాలికి వెళ్లారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శుక్రవారం హైదరాబాద్ తీసుకొస్తారని చెబుతున్నారు. వంశీకృష్ణ మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.